ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు టెస్టులు!

by  |
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు టెస్టులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు.. విస్తృతంగా నిర్వహించేందుకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్నది. ఈ క్రమంలోనే చైనా నుంచి ఐదు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు భారత్‌కు చేరాయి. అయితే, ఈ కిట్ల సమర్థతపై అప్పుడే పలు అనుమానాలు వెలువడ్డాయి. ఇప్పుడా అనుమానాలే నిజమవుతున్నట్టు తెలుస్తున్నది. దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కేంద్రం.. రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడా కిట్ల సమర్థత, కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజస్తాన్ అయితే.. కచ్చితత్వం లేని కారణంగా ఈ కిట్ల వినియోగాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది కూడా. రాష్ట్రాల నుంచి అందుతున్న ఈ ఫిర్యాదులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పందించింది. రెండు రోజులపాటు ఈ కిట్ల వినియోగాన్ని నిలిపేయాలని, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పరీక్షిస్తామని తెలిపింది. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపైనే టెస్టింగ్‌కు ఐసీఎంఆర్ సిద్ధమైంది.

భారత్ సరిపడా టెస్టులు నిర్వహించడం లేదన్న విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో విరివిగా కరోనా పరీక్షలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ కిట్లను సమకూర్చుకున్న తర్వాత.. కరోనా హాట్‌స్పాట్‌లలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు జరపాలని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది. ఆ కిట్లను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. పీసీఆర్ కిట్లతో కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యమవడమే కాదు.. వాటిని ల్యాబ్‌లలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అదీగాక, అన్ని రాష్ట్రాల్లో సరిపడా సదుపాయాలు లేకపోవడంతో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లవైపునకే కేంద్రం మొగ్గుచూపింది.

‘ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లలో కేవలం 5.4శాతం కచ్చితత్వమే’

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లలో లోపాలున్నాయని రాజస్తాన్ సహా పలురాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. కరోనా పాజిటివ్ వ్యక్తికి కూడా ఈ టెస్టింగ్ కిట్ నెగెటివ్ ఫలితాలను వెల్లడించిందని రాజస్తాన్ ఆరోపించింది. దీంతో ఈ కిట్లపై అనుమానాలు మొదలయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలోని హాట్‌స్పాట్‌లలో సుమారు 170 పరీక్షలు నిర్వహించామని, ఈ క్రమంలో అందరికీ టెస్టులు జరపగా ఈ విస్మయకర వాస్తవం వెలుగులోకి వచ్చిందని అన్నారు. అలాగే, ఈ టెస్టింగ్ కిట్లు కేవలం 5.4 శాతం మేరకే కచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని అంచనా వేశారు. అందుకే నిపుణుల సూచనల మేరకు ఈ టెస్టింగ్‌లను నిలిపేసినట్టు తెలిపారు. అలాగే, ఈ లోపాల గురించి ఐసీఎంఆర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు.

ఆ కిట్లను టెస్టు చేస్తాం : ఐసీఎంఆర్

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కచ్చితత్వంపై వస్తున్న అనుమానాలపట్ల ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కిట్ల పనితీరును నేరుగా తమ ప్రత్యేక బృందాలు పరీక్షించి.. ఆ ఫలితాల విశ్వసనీయతను అంచనావేస్తాయని పేర్కొంది. అందుకే రెండు రోజులపాటు ఈ కిట్లను వినియోగించవద్దని రాష్ట్రాలకు సూచించినట్టు వివరించింది. అనంతరం ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగంపై మార్గదర్శకాలను అందజేస్తామని తెలిపింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వైరస్‌ను సమర్థంగా గుర్తించడం లేదని ఒక రాష్ట్రం నుంచి ఫిర్యాదు అందినట్టు ఐసీఎంఆర్ ఎపిడమాలజీ, కమ్యూనికేబుల్ డిసీజ్ హెడ్ డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. ఈ ఫిర్యాదు తర్వాత మరో మూడు రాష్ట్రాలను వాకబు చేయగా.. ఫలితాల్లో తారతమ్యాలను గుర్తించినట్టు వివరించారు. ఈ పరిణామంపై ఏమాత్ర్రం ఉదారంగా ఉండరాదని, కచ్చితంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఈ రెండు రోజుల్లోపు ఎనిమిది నిపుణుల బృందాలను రాష్ట్రాలకు పంపిస్తామని, అవి కిట్ల ఫలితాలను పరిశీలిస్తాయని తెలిపారు. కాబట్టి అప్పటి వరకు అన్ని రాష్ట్రాలూ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగాన్ని నిలిపేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ కిట్ల ఫలితాలు తప్పుగానే వెలువడితే.. కిట్ల తయారీ సంస్థతో సమస్యను లేవనెత్తుతామని తెలిపింది.

Tags: coronavirus, tests, rapid testing kits, ICMR, rajasthan, complaints, faulty

Next Story

Most Viewed