- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్గత శక్తిని మేల్కొల్పే అమూల్య సాధనం యోగ : ఎస్పీ మహేష్ బి.గీతే
అంతర్గత శక్తిని మేల్కొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అమూల్య సాధనం యోగ అని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పేర్కొన్నారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : అంతర్గత శక్తిని మేల్కొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అమూల్య సాధనం యోగ అని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన యోగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు చేసిన ఎస్పీ మాట్లాడుతూ యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని అన్నారు. భారతీయ తత్వం ప్రతిపాదించే సార్వత్రిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పే సాధనంగా యోగ నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు యోగలోని శక్తిని, రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి విస్తృతంగా ఆచరిస్తున్నాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది యోగాభ్యాసాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని ఎస్పీ అన్నారు. యోగ సాధనతో ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. అనంతరం యోగ గురువు, వారి శిష్యులను ఎస్పీ అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్ర చారి, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మొగిలి, నటేష్, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, ఉపేందర్ చారి, రంజిత్, ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, శ్రీనివాస్, సాయి కిరణ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






