తాగునీటి నల్ల లాగా కాలనీల్లో పదుల కొద్దీ బెల్టు షాపులు.. ట్రాలీలో మద్యం సరఫరా చేస్తున్న యజమానులు

by Disha Web |
తాగునీటి నల్ల లాగా కాలనీల్లో పదుల కొద్దీ బెల్టు షాపులు.. ట్రాలీలో మద్యం సరఫరా చేస్తున్న యజమానులు
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం విక్రయాల లక్ష్యంగా పట్టణంలో బెల్ట్ షాపులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వైన్ షాప్ యజమానులు విక్రయాల టార్గెట్లను అధిగమించేందుకు బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. పట్టణంలో వందలాది బెల్టుషాపులు కనీవినీ ఎరుగని రీతిలో కాలనీలో వెలిశాయి. దీంతో కాలనీలు మత్తులో జోగుతున్న అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆబ్కారీ అధికారులు మద్యం షాపుల యజమానులు కుమ్ముక్కై బెల్లంపల్లిలో జోరుగా బెల్టుషాపుల దందాను సాగిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఇంటింటికీ తాగునీరు నల్ల లాగా ప్రతి కాలనీలో పదుల కొద్దీ బెల్ట్ షాపులు వెలువడడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో 8 వైన్ షాపులు ఉన్నాయి.

వైన్ షాపులకు బెల్ట్ షాపులు లింకు..

బెల్లంపల్లిలో మద్యం వ్యాపారం జోరుగా సాగేందుకు వైన్ షాప్ ఓనర్లు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. బెల్టుషాపులను ఆదాయ వనరుగా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఎక్సైజ్ అధికారులు మిన్నక ఉండడంతో మద్యం షాపు ఓనర్ లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పట్టణంలో మద్యం షాపులకు లింకుగా బెల్టుషాపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో బెల్టు షాపుల దందా యదేచ్ఛగా సాగుతోంది.ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న బెల్టుషాపులను నిర్మూలించాల్సిన అధికారుల చోద్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రాలీలతో మద్యం సరఫరా..

మద్యం వ్యాపారం లాభదాయకంగా సాగేందుకు వైన్ షాప్ ఓనర్లు అక్రమ పద్ధతులు ఎంచుకున్నారు.వైన్ షాపులకు అనుబంధంగా వెలసిన వందలాది బెల్టు షాపులకు వైన్ షాపు ఓనర్ లే స్వయంగా బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో వైన్ షాప్‌కు అనుసంధానంగా పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్టు షాపులకు వైన్ షాపు ఓనర్లే ప్రత్యేకంగా ట్రాలీలతో మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టుషాపులు మద్యం విక్రయాలు 24 గంటలు తలమునకలై ఉన్నాయి. వైన్ షాపుల కంటే బెల్టుషాపుల ద్వారానే మద్యం విక్రయాలు బెల్లంపల్లిలో అధికమయ్యాయి. వైన్ షాపుల మద్యం విక్రయాలు నిబంధనల మేరకు సాగుతుంటే, బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు మాత్రం నిరంతరాయంగా మారాయనంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. బెల్టు షాపులను ప్రోత్సహించడమే పెద్ద నేరమైన నప్పటికీ, వైన్ షాపు ఓనర్లు మరో అడుగు ముందుకేసి మద్యాన్ని బెల్టు షాపులకు టార్గెట్ నిర్ణయించి సరఫరా చేస్తూ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు పెల్లుబికుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న వైన్ షాపు ఓనర్ లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాలనీలో బెల్టుషాపుల కలకలం...

పట్టణంలోని ఆయా కాలనీల్లో అక్రమంగా వెలసిన బెల్ట్ షాపులు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో బెల్టు షాపులు అశాంతిని రేపుతున్నాయి. అందుబాటులో బెల్ట్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసవుతున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, కలతలు నిత్యకృత్యమయ్యాయి.. వీధుల్లోనే బెల్టు షాపులు మద్యాన్ని కుమ్మరిస్తున్నాయి. మద్యం కళ్ళముందే అందుబాటులోకి రావడంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిస అవుతున్నారు. అంతేకాకుండా బెల్టు షాపు ఓనర్లు మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. రాత్రిళ్లు మద్యం విక్రయాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. ఆ సమయంలో వైన్ షాపులు మూసి ఉండడంతో ఇదే అదునుగా ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్టుషాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా తమ ఆదాయం రెట్టింపు కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న వైన్ షాపు ఓనర్‌ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్టుషాపులను అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న వైన్ షాప్‌లను సీజ్ చేయాలని కార్మిక కుటుంబాలు అధికారులను కోరుతున్నాయి. అంతేకాకుండా బెల్టుషాపుల దందాకు అవకాశం ఇస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది.


Next Story

Most Viewed