- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దశాబ్దాల కల.. సరస్వతీ యూనివర్సిటీ ప్రారంభించేనా?
ఏప్రిల్ 6న CM బాసర ఆలయ పునర్నిర్మాణ పనుల పర్యటన ఖరారైన నేపథ్యంలో నూతన యూనివర్సిటీ ఏర్పాటు అంశం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి బాసర సరస్వతీదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి భూమి పూజలతో పాటు ‘ట్రిపుల్ ఐటీ’ పర్యటన ఖరారైన నేపథ్యంలో నూతన రాష్ట్ర యూనివర్సిటీ ఏర్పాటు అంశం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ విశ్వవిద్యాలయాల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి, గతంలో ఇచ్చిన హామీకి ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు వేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో ‘సరస్వతీ యూనివర్సిటీ’ ఏర్పాటు ప్రారంభ ప్రక్రియపై ‘బాసర ట్రిపుల్ ఐటి’ పర్యటనలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. దశాబ్దాల కలగా ఉన్న ఈ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కొత్త దారులు తెరుచుకుంటాయనే విశ్వాసం జిల్లావ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
------
రాష్ట్రంలో ‘కొత్త విశ్వవిద్యాలయం’ ఏర్పాటు అనగానే ప్రజల్లో ఆశలు రేగడం సహజం, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే అది కేవలం ఒక విద్యాసంస్థ కాదు తరాల భవిష్యత్తుకు మార్గదర్శి. అయితే యూనివర్సిటీ అనేది కేవలం రాజకీయ ప్రకటన కాదు. అది అమలు చేయలేకపోతే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సహజ సంపదలతో నిండిన అరణ్య ప్రాంతం. గిరిజన సంస్కృతికి ప్రతీక. తెలంగాణ రాష్ట్ర పటంలో ప్రత్యేక చరిత్ర కలిగిన నేల. కానీ రాజకీయ నిర్ణయాల వద్దకు వస్తే. ఇదే నేల వరుసగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురవడం విచారకరం.
ముఖ్యమంత్రి చొరవతో ..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, విద్యా వెనుకబాటును గుర్తిస్తూ ప్రత్యేక చొరవతో, రాజకీయ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ‘ఆలస్యానికి’ అవకాశం ఇవ్వకుండా, అమ్మవారి సన్నిధి బాసరలో శ్రీ సరస్వతీ దేవి పేరిట నూతన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నిర్మల్ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించి, అప్పటికప్పుడు అదే వేదిక నుండే ‘ప్రణాళికల తయారీ’ బాధ్యతను మంత్రి జూపల్లి కృష్ణారావుకి అప్పగించినపుడు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఒక కొత్త ఆశోదయం కనిపించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉన్నత విద్యా కేంద్రం ఇప్పుడు నిజం కానుందన్న నమ్మకం కలిగింది.
నూతన దిశానిర్దేశం
ముఖ్యంగా తాత్కాలికంగా ‘ట్రిపుల్ ఐటీ ప్రాంగణం’ లోనే ప్రారంభిస్తామని అధికారిక ప్రకటన చేయడం ఆశలకు బలాన్నిచ్చింది. కానీ నెలలు గడుస్తున్నా అమలు దిశగా స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తూ, ముఖ్యమంత్రి ప్రకటన ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో రేపటి పర్యటన ఖారారైన సందర్భంలో నూతన యూనివర్సీటీ ఏర్పాటు అంశం మళ్లీ ఊపిరి పోసుకుంది. ఈ దశాబ్దాల ఆకాంక్షకు నూతన దిశానిర్దేశం లభిస్తుందనే విశ్వాసం జిల్లావ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
ప్రకటన తప్పిస్తే..
యూనివర్సిటీ ఏర్పాటు ఒక క్రమబద్ధమైన, చట్టబద్ధమైన ప్రక్రియ. అవసరాల గుర్తింపు నుంచి కాన్సెప్ట్ నోట్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), భూసేకరణ, బడ్జెట్ కేటాయింపు, చట్టం రూపకల్పన వంటి దశలు పూర్తి కావాలి. కాన్సెప్ట్ నోట్ దిశను నిర్ధారిస్తే, DPR పూర్తి ప్రణాళికను ఇస్తుంది. భూమి, నిధులు లేకుండా ప్రాజెక్ట్ ముందుకు సాగదు. శాసనసభ ఆమోదంతో ప్రత్యేక చట్టం ద్వారా యూనివర్సిటీకి చట్టబద్ధ హోదా వస్తుంది. ప్రస్తుతం బాసర యూనివర్సిటీ విషయంలో ప్రకటన తప్ప మిగతా దశల్లో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు.
భావితరాల కోసం...
ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యా భవిష్యత్తుకు కీలకం. బాసరలో యూనివర్సిటీ ఏర్పడితే పేద, గిరిజన విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ‘శ్రీ జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి’ రెండుదశాబ్దాలుగా ఈ లక్ష్యంతో పోరాడుతోంది. 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మల్ పీజీ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనతో రూ.55 కోట్ల మంజూరీ కూడా లభించింది. కానీ తరువాత ఇది అమలు కాలేదు. తెలంగాణ ఏర్పాటుకు తర్వాత కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ అంశం పక్కనపడింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆశలు పెంచింది. ఇప్పుడు ఆ ప్రకటనను అమలు చేయడమే ప్రజల్లో నమ్మకం కలిగిస్తుంది.
(ఏప్రిల్ 6న సీఎం ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా)
నంగె శ్రీనివాస్,
అధ్యక్షుడు, శ్రీ జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి,
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.
94419 09191






