- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్స్‌లోని సవాళ్ల కొండను కొత్త డైరెక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ అధిగమించేనా?
నిమ్స్ 19వ డైరెక్టర్‌గా సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ముందు ఎమర్జెన్సీ బెడ్ల కొరత, సిబ్బంది నియామకాలు, అంతర్గత వివాదాలను పరిష్కరించే భారీ సవాళ్లు ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ఖైరతాబాద్: పేదోడి కార్పొరేట్ ఆసుపత్రిగా పేరుగాంచిన నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పాలనా పగ్గాలు మారాయి. ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ బీరప్ప స్థానంలో, నిమ్స్‌లోనే అత్యంత కీలకమైన యూరాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్‌ను నూతన డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
సమర్థుడి చేతికి పగ్గాలు.. ట్రాక్ రికార్డ్ ఇదే!
డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్, నిమ్స్‌లో అత్యంత విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న వైద్యుల్లో ఒకరు. ఆయన నేతృత్వంలోని యూరాలజీ విభాగం ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
సవాళ్ల కొండ.. ఎమర్జెన్సీ కష్టాలు తీరేనా?
నూతన డైరెక్టర్ ముందున్న ప్రధాన సవాలు ఎమర్జెన్సీ. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో పడక దొరక్క రోగులు స్ట్రెచర్ల పైన, వీల్ చైర్ల పైన గంటల తరబడి నిరీక్షించే దయనీయ పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి. రోగుల బంధువులను తప్పుదారి పట్టించి ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలించే అంబులెన్స్ మాఫియాను కట్టడి చేయడంలో ఇన్నాళ్లుగా నిమ్స్ యాజమాన్యం విఫలమైందనే ఆరోపణలున్నాయి. నిత్యం నాలుగు వేలకుపైగా ఓపీ సేవలు అందించే నిమ్స్‌లో అందుకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది లేక రోగులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మంజూరైన 600కు పైగా కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముంది. 15 ఏళ్ల క్రితం ఉన్న వైద్యులు, సిబ్బంది సంఖ్యే నేటికీ కొనసాగుతోందని, రిటైరైన వారి స్థానంలో నియామకాలు సరిగ్గా జరగలేదని సిబ్బంది వాపోతున్నారు.
అంతర్గత కుమ్ములాటలు.. సీనియర్ల నిష్క్రమణ!
కొందరు కొత్తగా వచ్చే వైద్యులు, ఉద్యోగులను వేధిస్తుండటంతో పలువురు హెచ్ఓడీలు నిమ్స్‌ను వదిలి వెళ్తున్నట్లు చర్చ నడుస్తోంది. న్యూరో సర్జన్ డాక్టర్ రాజేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ రుక్మిణి సహా పలువు తమ పైవారి పెత్తనం భరించలేకే నిమ్స్‌ను వీడారని టాక్. ప్రస్తుతం ఉన్న డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ సైతం రాజీనామాకు సిద్ధపడగా, ఉన్నతాధికారుల జోక్యంతో ప్రస్తుతానికి ఆగినట్లు తెలుస్తోంది.
పెన్షన్ కష్టాలు.. అవినీతి ఆరోపణ మరకలు
రిటైర్ అయిన వారికి ఇప్పటికీ పెన్షన్ బెనిఫిట్స్ క్లియర్ కాలేదని తెలుస్తుంది. గత డైరెక్టర్ బీరప్ప హయాంలో రోబోటిక్ పరికరాల కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇన్ని లోపాల మధ్య రాహుల్ దేవ్‌రాజ్ నియామకంపై సర్వత్రా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు వేల పడకల సామర్థ్యం గల డైమండ్ బ్లాక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త డైరెక్టర్ తక్షణమే ఎమర్జెన్సీ సేవల విస్తరణ, పెండింగ్‌లో ఉన్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామకాలు, అవినీతి అక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది. కొత్త డైరెక్టర్ రాకతో నిమ్స్ వెయిటింగ్ లిస్ట్ కష్టాలు తీరి, సామాన్యుడికి సత్వర కార్పొరేట్ వైద్యం అందుతుందో లేదో వేచి చూడాలి.
రాహుల్ దేవరాజ్ బాధ్యతల స్వీకరణ
నిమ్స్ 19వ డైరెక్టర్‌గా యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ డైరెక్టర్ నగరి బీరప్ప బాధ్యతలను రాహుల్ దేవరాజ్‌కు అప్పగించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, పరిపాలన విభాగం హెచ్‌వోడీ లక్ష్మీ భాస్కర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణా రెడ్డి, అమరేశ్వర్, రామ్మూర్తి పాల్గొన్నారు.






