- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోమటిరెడ్డి మాటల వెనుక వ్యూహం ఏంటి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్గి రాజేశారు. చౌటుప్పల్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన, "త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది, ఒకవేళ రాకుంటే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతా" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.

దిశ, చౌటుప్పల్: త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది. మంత్రి పదవి రాకుంటే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతా ఈ మాటలు ఎవరివో కావు తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తూ వివిధ సందర్భాల్లో ఆయన ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థుల తో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
మంత్రి ఇవ్వకుంటే ముఖ్యమంత్రి ఎలా!
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిలో చేరి పోరాడి ఓడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి హామీతోనే చేరినట్లు స్వయంగా ఆయనే పలుమార్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కాలం పూర్తి అయినప్పటికీ నేటికీ మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవి లేకపోవడంతో ఆయన పలుమార్లు అసంతృప్తి వెళ్లగక్కుతూ వస్తున్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పై మౌనం మాత్రం వీడడం లేదు. నియోజకవర్గంలోని చౌటుప్పల్, చండూరు మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేవిధంగా భువనగిరి ఎంపీ సీటును గెలిపించడంలో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు.
భువనగిరి ఎంపీ సీటు గెలిపించిన అనంతరం మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి హామీ ఇచ్చినట్లు కూడా తెలిసింది. అయినా నేటికీ మంత్రి పదవిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై కాస్తంత గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. దీంతో గత రెండు రోజుల క్రితం త్వరలోనే మంత్రి పదవి రాకపోతే ముఖ్యమంత్రిని అవుతానని కామెంట్స్ చేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగనుంది?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ లో చేసిన కామెంట్స్ తో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే చర్చ ప్రతి గ్రామంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలతో పాటు ఆయన సన్నిహితులు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్న అది రాష్ట్రంలో సంచలనంగా మారుతుండటంతో ఆయన మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారా! ఆ విధంగా ఏమైనా ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయా అనే చర్చ నియోజకవర్గంలో సాగుతుంది. లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్లో కార్యకర్తలంతా మునుగోడు నియోజకవర్గాన్ని చూసుకుంటే తాను రాష్ట్రమంతా చూసుకుంటానని అనడం వెనుక ఏం మర్మం దాగి ఉందొననే చర్చ సాగుతోంది.
నూతన పార్టీ పెడతారా!
మంత్రి పదవి కోసం మరికొంత కాలం వేచి చూస్తానని సమయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎత్తడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కామెంట్స్ చేయడం పట్ల నూతన పార్టీని స్థాపిస్తారా అనే అనుమానం కలుగుతుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే త్వరలోనే ఆయన పార్టీ మారి మరో పార్టీలో ముఖ్యమంత్రి హామీతో చేరుతారా లేదా స్వయంగా ఆయనే నూతన పార్టీని స్థాపించి రాష్ట్ర మొత్తం తిరుగుతారా అనే చర్చ నియోజకవర్గంలో ప్రతి గల్లీలో జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏ స్థాయి నిర్ణయాలైనా తీసుకోవడంలో వెనకడుగు వేయడని కాంగ్రెస్ పార్టీలోని క్రియాశీలక కార్యకర్తలు అనుకుంటారు. తాజాగా ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కామెంట్ల పై స్పందించి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల అనుమానాలకు ఓ పుల్ స్టాప్ పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే.






