- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిగడ్డలో నీటి సంక్షోభం
జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు ముఖం చాటేయడం, ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. జిల్లాకు గుండెకాయ లాంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ)తో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం (జేఎన్ఎల్ఐఎస్), రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)ల పరిధిలో సాగునీటి కోసం బొట్టు నీరు కూడా అందుబాటులో లేదని అధికారులు స్పష్టం చేస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అడుగంటిన జూరాల.. నిలిచిన సరఫరా..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్థూల నీటి నిల్వ సామర్థ్యం 5.729 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రత్యక్ష వినియోగ (లైవ్) నిల్వ కేవలం 2.022 టీఎంసీలకు పడిపోయింది. ఈ ప్రాజెక్టు కింద కుడి ప్రధాన కాలువ (ఆర్ఎంసీ) ద్వారా 35,657 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ (ఎల్ఎంసీ) ద్వారా 69,084 ఎకరాలు కలిపి మొత్తం 1,02,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ప్రస్తుత తరుణంలో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసిన అధికారులు, అందుబాటులో ఉన్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే కేటాయిస్తున్నారు.మరోవైపు, 2 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, 87,500 ఎకరాల విస్తీర్ణం ఉన్న రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) కింద కూడా పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 3,89,700 ఎకరాల ఆయకట్టు నీరు లేక ఎండిపోయే ప్రమాదంలో పడింది.
వరి వద్దు.. ఆరుతడే ముద్దు!
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోవడంతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూడాలని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి వంటి పంటల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికి వచ్చే ఆరుతడి పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, శనగ, నువ్వులు, వేరుశెనగ, పత్తి పంటలను సాగు చేసుకోవడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వర్షపాత పరిస్థితులను గమనిస్తూ, వ్యవసాయ అధికారుల సలహాల మేరకే పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి: రైతు సంఘాల డిమాండ్
వర్షాలు ఆలస్యమై, ప్రాజెక్టులు ఖాళీగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జోగులాంబ గద్వాల జిల్లా నీటి పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి లభ్యతపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.






