యుద్ధమేఘాలు..10,000 మంది సైనికులతో హర్మూజ్ దిగ్బంధనం

by Malleboina Mahesh |

హర్మూజ్ జలసంధిలో అమెరికా భారీ దిగ్బంధనం! 10 వేల మంది సైన్యం, 12 యుద్ధనౌకలతో ఇరాన్ పోర్టులకు బ్రేక్. బ్యారెల్ చమురు ధర $100 దాటింది.

యుద్ధమేఘాలు..10,000 మంది సైనికులతో హర్మూజ్ దిగ్బంధనం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ తీరంలోని ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ సైనిక దిగ్బంధాన్ని (Naval Blockade) ప్రారంభించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఈ సాహసోపేతమైన చర్యకు దిగింది.

భారీగా మోహరించిన అమెరికా బలగాలు

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్ కోసం సుమారు 10,000 మంది సుశిక్షితులైన సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో మెరైనర్లు, సెయిలర్లు మరియు ఎయిర్‌మెన్‌లు ఉన్నారు. ఈ దిగ్బంధనంలో 12 అత్యాధునిక యుద్ధనౌకలు, పలు యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో గత 24 గంటల్లో అమెరికా దిగ్బంధనాన్ని దాటి ఒక్క నౌక కూడా హర్మూజ్‌ను దాటలేదని సెంట్రల్ కమాండ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ధృవీకరించింది. నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన 6 వాణిజ్య నౌకలను అమెరికా సైన్యం వెనక్కి పంపినట్లు సమాచారం.

చర్చల విఫలమే ప్రధాన కారణం..

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ఇరాన్ తన అణు కార్యకలాపాలను నియంత్రించుకోకపోవడం, హర్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగించే నౌకల నుంచి అక్రమంగా టోల్ వసూలు చేయడం వంటి చర్యలను నిరసిస్తూ అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే, ఇతర దేశాలకు వెళ్లే నౌకలకు ‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్’ కింద అనుమతి ఉంటుందని, కేవలం ఇరాన్ ఓడరేవులకు వెళ్లే మరియు వచ్చే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని అమెరికా స్పష్టం చేసింది.

ప్రపంచ మార్కెట్లపై ప్రభావం..

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా పై తీవ్ర ప్రభావం పడింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 7 నుంచి 8 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తన సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.

Next Story