రోజా ఇంట్లో కూర్చొని చేసిన ప్రకటన మర్చిపోయారా?.. హరీష్ రావుకు ఉత్తమ్ కౌంటర్

by Gantepaka Srikanth |

పోలవరం - నల్లమలసాగర్‌ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ భేటీలో వ్యతిరేకించామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

రోజా ఇంట్లో కూర్చొని చేసిన ప్రకటన మర్చిపోయారా?.. హరీష్ రావుకు ఉత్తమ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం - నల్లమలసాగర్‌ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ భేటీలో వ్యతిరేకించామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. అసలు ఈ ప్రాజెక్టుకు అనుమతే ఇవ్వలేదంటూ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆఆర్ పాటిల్ తమకు లేఖ రాస్తే... పథకం ప్రకారమే పోలవరం-నల్లమలసాగర్‌కు తాము సహకరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించేలా శుక్రవారం నాటి సమావేశంలో రాష్ట్ర అధికారుల వాదనలు ఉన్నాయని స్పష్టం చేశారు. పోలవరం - బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు అనుమతులు ఇవ్వలేదని సమావేశంలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన వారే విమర్శించడం విడ్డూరమని మంత్రి ఆరోపించారు. హరీష్ రావు ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం మంత్రి ఉత్తమ్ మీడియాతో జూమ్ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. పోలవరం-నల్లమలసాగర్‌ పరిష్కారం కోసమే సమావేశం నిర్వహిస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలు అర్థంపర్థం లేనివని ఆయన తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణానదిలో 811 టీఎంసీల్లో 70శాతం వాటా తెలంగాణకు, 30శాతం వాటా ఏపీకి కేటాయించాలని కేఆర్ఎంబీ ముందు ప్రస్తావించామని... అదే విధంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.

అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ప్రకటన

గోదావరి జలాలను రాయలసీమకు తీసుకుపోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పిందే కేసీఆర్ అని అందుకు తగ్గట్లుగా అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడేదో గోదావరి జలాలు తీసుకుపోతుంటే తాము కుమ్మక్కు అయినట్లుగా తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. బనకకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై అన్ని వేదికలపైనా తాము తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు ఈ మేరకు తాను, సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు కలిసి ఈ ప్రాజెక్టులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జీఆర్ఎంబీకి తాము ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సైతం రిట్ పిటిషన్ దాఖలు చేశామని... ఇప్పుడు ఒరిజనల్ సూట్ వేసినట్లు వెల్లడించారు. సీడబ్ల్యూసీ నుంచి నల్లమలసాగర్ విషయంలో ఏపీ ఇచ్చిన డీపీఆర్ కు అనుమతి ఇవ్వలేదని గత నెల తమకు లేఖ అందిందన్నారు. గత నెలలోనే సీఆర్ పాటిల్ సైతం తమకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రిలిమినరీ రిపోర్ట్, ప్రీ ఫీజబిలిటి రిపోర్టులపై కేంద్ర ఏజెన్సీలు, ఇతర రాష్ట్రాలకు పంపించామని... దేనికీ అనుమతి ఇవ్వలేదని, డీపీఆర్ కు, ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అయినా ప్రతీసారి ప్రజలను అబద్దాలతో అయోమయానికి గురి చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

చుక్క నీటిని కూడా వదులుకోం...

కృష్ణా-గోదావరి నదుల జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగాలేమని మంత్రి స్పష్టం చేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎజెండాలో ఇంక్లూడ్ చేసేందుకు ఒప్పుకోబోమని, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మాత్రం తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని... వీటిని ఎజెండాలో పెట్టాలని కేంద్రానికి ఏపీ ప్రతినిధుల ముందే మన రాష్ట్ర అధికారులు చెప్పారని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 1.8 కోట్లు నీటిపారుదల రంగంపై ఖర్చు చేసి కట్టిన ఒక్కగానొక్క ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, సహా అనేక ప్రాజెక్టులను కనీసం పూర్తి చేయలేదని ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టి ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం కేవలం దోపిడీ తప్ప చేసిందేమీలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని... లక్ష కోట్లు ఖర్చు చేసి ఐదేళ్లలో కేవలం 60 టీఎంసీలు మాత్రమే ఉపయోగించి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమన్నారు. హరీష్ రావు మాటలు గోబెల్స్ ను మించిపోయాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని... నియాకమాలు, పదోన్నతులు లేకుండా నాశనం చేస్తే... ఇప్పుడు అన్ని క్రమపద్ధతిలో చేపడుతున్నామని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ గురించి మాట్లాడటం తగదని.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాజెక్టులను చూసింది ఆయనేనని... తెలంగాణ హక్కులను కాపాడేందుకే ఆయనను సలహాదారుగా నియమించుకున్నామని పేర్కొన్నారు.

Next Story