ఇరాన్ దెబ్బ.. ఆర్మీ క్యాంపులు వదిలి హోటళ్లకు షిఫ్ట్ అయిన అమెరికా దళాలు

by Muthe.Rajitha |

ఇరాన్ చేస్తున్న దాడుల దెబ్బకు అమెరికా సైన్యాలు ఆర్మీ క్యాంపులు వదిలి హోటల్స్ కు చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇరాన్ దెబ్బ.. ఆర్మీ క్యాంపులు వదిలి హోటళ్లకు షిఫ్ట్ అయిన అమెరికా దళాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తన అధునాతన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్ లో సైన్యం ప్రాణనష్టాన్ని నివారించడానికి అమెరికా దళాలు తమ బేస్‌లను ఖాళీ చేసి పౌర జనాభా ఉండే హోటళ్లకు తరలిపోతున్నాయని సమాచారం. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణంగా సైనిక స్థావరాలు నిర్దేశిత లక్ష్యాలుగా ఉంటాయి కాబట్టి వాటిపై దాడులు చేయడం సులభం.

కానీ సైనికులు సామాన్య ప్రజలు నివసించే హోటళ్లలో బస చేయడం వల్ల దాడులను అడ్డుకోవచ్చని అమెరికా భావిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా తమ పౌరులను హ్యూమన్ షీల్డ్స్ గా వాడుకుంటోందని, ఇది యుద్ధ నియమాలకు విరుద్ధమని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకున్నా, ఆ భవనాలను కూడా సైనిక లక్ష్యాలుగానే పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాదు అమెరికా సైన్యం ఆచూకీ చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది.

మరోవైపు ఈ యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారీ దెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా రక్షణ వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. ముఖ్యంగా రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్, నిఘా పరికరాలు ఇరాన్ దాడుల్లో ధ్వంసం కావడంతో సుమారు 800 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నేపథ్యంలో సైనిక స్థావరాల్లో ఉండటం సురక్షితం కాదని భావించిన అమెరికా కమాండర్లు తమ దళాలను గ్రూపులుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సైనికులను చిన్న చిన్న బృందాలుగా విడగొట్టి వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో ఉంచడం ద్వారా పెద్ద ఎత్తున జరిగే క్షిపణి దాడుల నుండి వారిని రక్షించుకోవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story