- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 87 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు
ఖమ్మంలోని ఖానాపురం ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీకి భూసేకరణ అడ్డుగా మారింది.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంలోని ఖానాపురం ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీకి భూసేకరణ అడ్డుగా మారింది. మొత్తం 87 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం కొనసాగిస్తున్నారు. మ్యాన్ హోల్స్, మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ధంసలాపురం వద్ద భూసేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పై నీలి నీడలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ నిర్మాణం ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకుంటే ఖానాపురం చెరువు వరద నీటితో పలు డివిజన్లు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ఖానాపురం ఊర చెరువు నుంచి మున్నేరు కలిసే ధంసలాపురం చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే నగరంలోని మూడో డివిజన్‌తో సహా ఏడు డివిజన్లలో వరద ముప్పు తగ్గుతుంది. దీనికోసం 9 కిలోమీటర్ల మేర 475 మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా పుట్టకోట ధంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటిని ధంసలాపురం చెరువులో వదిలేందుకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేశారు.
ఇంటింటి నుంచి మురుగు నీరు బయటకు పంపేందుకు..
ఏడు డివిజన్ల పరిధిలో ప్రతి ఇంటి నుంచి మురుగునీటిని భూగర్భ డ్రైనేజీలోకి పంపే విధంగా, అలుగు నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇంకా 50 వరకు మ్యాన్ హోల్స్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇక అలుగు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉంది. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం 18 నెలలుగా సాగుతుండటంతో మురుగు సమస్య ముందుకు వచ్చింది. ముంపు ఆందోళణ ప్రజల్లో నెలకొంది.
ముందుకు సాగని మురుగునీటి శుద్ధి..
భూగర్భ డ్రైనేజీ ద్వారా వచ్చిన మురుగునీటిని శుద్ధిపరిచే కేంద్రాల నిర్మాణం ముందుకు సాగడం లేదు. పుట్టకోట వద్ద రెండున్నర ఎకరాలు భూసేకరణ చేసి రోజుకు 9.5 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఏడాదికాలంగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇక ధంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి సుమారు 7 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకు అనేక అడ్డంకులు ఏర్పడటంతో ఇంతవరకు మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఈ నేపద్యంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం సకాలంలో అవుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
నెల రోజుల్లో పూర్తి చేస్తాం:ప్రజారోగ్య శాఖ ఈఈ రంజిత్ కుమార్
భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ఖమ్మం కార్పొరేషన్ ఇంచార్జి ఎస్ఈ, ప్రజారోగ్య శాఖ ఈఈ రంజిత్ కుమార్ తెలిపారు. మ్యాన్ హోల్స్ నిర్మాణం పూర్తి చేసి పైపుల అమరిక చేస్తామని, దంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. అడ్డంకులు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించి, నిర్మాణం చురుగ్గా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.






