ప్రభుత్వ ఆసుపత్రిని గాలికి వదిలేసిన ముగ్గురు మంత్రులు

by Batti.Sumithra |

ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న 60 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదనంగా 150 మంది నర్సులను కేటాయించాలని, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలను మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో సర్వే నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిని గాలికి వదిలేసిన ముగ్గురు మంత్రులు
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న 60 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదనంగా 150 మంది నర్సులను కేటాయించాలని, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలను మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో సర్వే నిర్వహించారు. మంగళవారం సర్వేలో దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు.

అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉన్న ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌ను అధికారులు, మంత్రులు పట్టించుకోకపోవడం వల్ల రోజురోజుకూ కూనరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో 60 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేయాలని కోరారు. సీనియర్ నర్సులు లేకపోవడం వల్ల జూనియర్ నర్సులతోనే కాలం వెళ్లదీస్తున్నారని, దీంతో రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అదనంగా 150 నర్సు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, టీ-హబ్ పేరిట వందలాది ల్యాబ్ టెస్టులు చేస్తామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ, ల్యాబ్‌లోని అనేక యంత్రాలు చెడిపోయి ఉండటంతో అవి సక్రమంగా పనిచేయడం లేదని, దీంతో సరైన పరీక్షా ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. ఫార్మసిస్టులు తగినంత మంది లేకపోవడం వల్ల 24 గంటల మెడికల్ షాప్ అందుబాటులో లేదని అన్నారు. ప్రస్తుతం లేని విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవల కోసం ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు, ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రైవేటు వైద్యాన్ని నియంత్రించలేకపోయినా, ప్రభుత్వ వైద్యాన్ని అయినా పేదలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శిరోమణి మాట్లాడుతూ తక్షణమే మాతా-శిశు కేంద్రానికి అదనపు డాక్టర్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అధ్యక్షత వహించగా, నాయకులు కె. శ్రీను, శోభ, రాకేష్, సత్తార్, లెనిన్, లక్ష్మణ్, నరసింహారావు, కొమరయ్య, ధరావత్ లక్ష్మణ్, ప్రేమ్ సింగ్, జాస్మిన్, సుజాత, రామారావు, రామనాథం, వెంకన్న, దేవ్లా తదితరులు పాల్గొన్నారు.

Next Story