సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవ ఇది: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 06:27:13  IST  )

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితన్ గడ్కరీ ఆద్వర్యంలో భాద్యతలను స్వీకరించారు.

సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవ ఇది: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితన్ గడ్కరీ ఆద్వర్యంలో భాద్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనలాంటి ఒక సాధారణ కార్యకర్తకు పార్టీలో అత్యున్నత పదవిని అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, కార్యకర్తలందరికీ సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవను కొనియాడిన ఆయన, సాధారణ కార్యకర్తలు ఎప్పుడూ ప్రధానిని ఒక గొప్ప స్ఫూర్తిగా భావిస్తారని పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో నాటి జ్ఞాపకాలు గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన 'సద్భావన మిషన్' కార్యక్రమాన్ని నితిన్ నబీన్ గుర్తు చేసుకున్నారు. "నాడు ప్రధాని మోడీ ప్రతి ఒక్కరి మాటను ఎంతో ఓపికగా వినడం చూశాను. కార్యక్రమం తర్వాత ఆయన గ్రీన్ రూమ్‌లో ప్రజల భావోద్వేగాల గురించి వివరిస్తున్నప్పుడు ఆయన కళ్ళలో ఆవేదన కనిపించింది. ప్రజల భావోద్వేగాలతో మమేకమైనప్పుడే ఒక వ్యక్తి గొప్ప నాయకుడిగా ఎదుగుతారని నేను ఆ రోజే అర్థం చేసుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

విపక్షాల తీరుపై ధ్వజమెత్తిన నితిన్ నబీన్

దేశంలోని ప్రతిపక్ష పార్టీల తీరుపై నూతన అధ్యక్షుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమిళనాడులో పవిత్రమైన కార్తీక దీపోత్సవాన్ని అడ్డుకోవాలని చూడటం, న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలకు ప్రయత్నించడం వంటివి విపక్షాల కుట్రలకు నిదర్శనమన్నారు. సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడితే విపక్షాలకు ఎందుకు అసహనం కలుగుతోంది? రామసేతు ఉనికిని కాదనే వారికి, మన సంస్కృతిని వ్యతిరేకించే వారికి భారత రాజకీయాల్లో చోటు ఉండకూడదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

వికసిత భారతమే లక్ష్యం

ఈ పదవిని తాను కేవలం ఒక హోదాగా కాకుండా, పార్టీ సిద్ధాంతాలను, జాతీయవాద ఉద్యమ బాధ్యతను మోసే ఒక సంకల్పంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 140 కోట్ల భారతీయులు నేడు 'వికసిత్ భారత్ కల కోసం శ్రమిస్తున్నారని, ఈ ప్రయాణంలో తనను భాగస్వామిని చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని ఆయన ఈ సందర్భంగా ప్రతిన బూనారు.

Next Story