కిందికుంట ఆచూకీ గల్లంతు.. సర్వే నెంబర్లు తారుమారు

by Disha Web Desk 12 |
కిందికుంట ఆచూకీ గల్లంతు.. సర్వే నెంబర్లు తారుమారు
X

దిశ, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ కిందికుంట స్థలం విషయంలో చాలా కాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చెరువు స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు సాగించారు. ఇప్పటికే చాలా నిర్మాణాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్టు స్వయంగా ఇరిగేషన్ ఈ ఈ ధృవీకరించారు. కానీ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జరిగేవి జరుగుతూనే ఉంటాయనే ధోరణిలో చోద్యం చూస్తూ కూర్చున్నారు. కింది కుంట చెరువును కబ్జా కోరల్లో నుండి కాపాడాలంటూ ఫోరమ్ టూ ఇంప్రూవ్ థింగ్స్ సంస్థ ప్రతినిధులు ఆగస్టు 5, 2020లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వారి అభ్యర్థనపై న్యాయస్థానం సైతం ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు చెరువు పరిరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ స్వయంగా వెళ్లి చెరువును సందర్శించి అయినా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అటు జీహెచ్ఎంసీ అధికారులు కోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి అనుమతులు జారీ చేయడం వారికి న్యాయస్థానాల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో చెప్పకనే చెబుతోంది. అన్ని శాఖల అధికారులు ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు..? ఎవరు వెనుక ఉన్న స్థలాన్ని ముందు చూపిస్తూ ఎవరికి అమ్మకాలు సాగించారు..? ఎలా చేతులు మారింది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

కిందికుంట చెరువు గతంలో మంచినీటి చెరువుగా ఉండేదని, నగరం విస్తరిస్తున్న క్రమంలో ఈ చెరువు కూడా అన్యాక్రాంతం అవుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువు వెనుక భాగంలో కొందరు వ్యక్తులు తమ స్థలాన్ని అమ్మకాలు సాగించారు. ఎవరికి వారు ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ప్రస్తుతం కింది కుంట చెరువు సర్వేనెంబర్ 119 లో కడుతున్న సికింద్రాబాద్ నాయకుడికి చెందినదిగా చెబుతున్న నిర్మాణం అనుమతులు 52, 54లో ఉన్నట్లు వారే జీహెచ్ఎంసీ పర్మిషన్ కోసం చేసుకున్న డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. అది కెడెస్ట్రల్ మ్యాప్ లోనూ, విలేజ్ మ్యాప్ లోనూ చెరువు వెనుక భాగంలో అంటే లక్ష్మీ గాయత్రి ఎంక్లేవ్ సర్వే నెంబర్ 120 కాగా దాని వెనకాల వైపు 51, 54, 52, 53 సర్వే నెంబర్లు చూపిస్తుంది. సర్వేనెంబర్ 119 రోడ్డుకు ఆనుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ 52, 54 సర్వే నెంబర్లను క్లెయిమ్ చేస్తున్న వారు మాత్రం తమ స్థలం చెరువు వెనకాల కాకుండా చెరువు ముందు చూపించడం గమనార్హం. ఇదంతా నిన్నామొన్న జరిగింది కాదు. ఈ రెండు సర్వే నెంబర్లను చెరువు వెనక నుంచి ముందుకు చూపించడం లో ఇద్దరు నాయకులు కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. చెరువు వెనుక అంతగా డెవలప్మెంట్ ఉండక పోవడం ధర కూడా తక్కువగా ఉండడంతో ఆ సర్వే నెంబర్లను ముందుకు చూపించేందుకు ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

సూత్రధారులు ఎవరు.. పాత్రధారులు ఎవరు..?

ఈ సర్వే నెంబర్లను వెనుకకు బదులుగా ముందు చూపించడం లో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ స్థలం విషయంలో పలుమార్లు పంచాయతీలు జరగగా ఓ ప్రజాప్రతినిధి తప్పుకోగా, మరో ఇద్దరు మాత్రం తీవ్రంగా ప్రయత్నించి స్థలాన్ని ముందు చూపించడం లో సక్సెస్ అయ్యారు. అంతేకాదు మేమున్నాం అంటూ సికింద్రాబాద్ లీడర్ చేత పెట్టుబడి పెట్టించి మరీ ఆయనకు అంటగట్టినట్టు విమర్శలున్నాయి. అంతకుముందు కూడా ఇందులో హడావుడిగా నిర్మాణాలు సాగించేందుకు పూనుకున్నా మధ్యలో స్థానిక బీజేపీ నాయకుడు అడ్డుపడడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం తో కొన్నాళ్లు బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత సికింద్రాబాద్ నాయకుడి చేతుల్లోకి స్థలం చేరడంతో ఆయన నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికైనా కింది కుంట చెరువు స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వార్తలు రాస్తే అయిపోదు..

కింది కుంట చెరువు ఆక్రమణలు, సర్వేనెంబర్ అవకతవకలపై పూర్తి ఆధారాలతో, పక్కా సమాచారంతో దిశ దినపత్రికలో గత నాలుగు రోజులుగా వరుస కథనాలు ప్రచురితం అవుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. అయితే ఈ కథనాలు కొందరు నాయకులకు కంటగింపుగా మారుతుండడం, వీటిపై సర్వత్రా చర్చ నడవడం, ప్రభుత్వ పెద్దల నుండి ఫోన్లు రావడంతో ఒత్తిడికి గురవుతున్న ఓ నాయకుడు.. పలువురికి ఫోన్లు చేసి వార్తలు రాస్తే అయిపోతదా, నా సంగతి తెలియదు అంటూ దిశ దినపత్రిక ప్రతినిధికి పరోక్ష హెచ్చరికలు జారీ చేయడం, అనుచరుల ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించడం వారి పిరికితనానికి, అవివేకానికి నిదర్శనమే అవుతుంది. పూర్తి ఆధారాలతో కింది కుంట చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉంది, బఫర్ జోన్ ఎంత వరకు వస్తుంది.? కింది కుంట చెరువు సర్వే నెంబర్ ఎక్కడ ఉంది. నిర్మాణదారులు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి. కోర్టు కేసులు, అధికారులు నిర్దారించిన మ్యాప్ లు తప్పు అని ఆధారాలు చూపిస్తే దిశ పత్రిక ప్రతినిధులకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉండదు కూడా. కానీ బెదిరింపుల వల్ల ఆగేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

Next Story

Most Viewed