2010 ఆబ్కారీ కుంభకోణం కేసులు 16 ఏళ్లుగా పెండింగ్‌ : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

by Muthe.Rajitha |

పెండింగ్ లో ఉన్న ఆబ్కారీ కేసులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

2010 ఆబ్కారీ కుంభకోణం కేసులు 16 ఏళ్లుగా పెండింగ్‌ : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2010లో వెలుగులోకి వచ్చిన భారీ ఆబ్కారీ కుంభకోణం కేసులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. గత 16 ఏళ్లుగా విచారణలు కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయాలు వెలువడకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. ఈ కేసుల్లో తక్షణ చర్యలు తీసుకుని, విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కొరుతూ సంస్థ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి మంగళవారం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ కుంభకోణంపై ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేయబడిందని పేర్కోన్నారు. విచారణలో కొందరు మంత్రులు, శాసనసభ్యుల ప్రమేయం ఉందని వార్తలు వచ్చినప్పటికీ, తరువాత సిట్‌ను రద్దు చేసి, ఏసీబీ డీజీని బదిలీ చేసి కొత్త డి.జి.ను నియమించారని తెలిపారు.

రాజకీయ నాయకులను తొలగించి, అధికారులు బినామీలపై మాత్రమే కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కోన్నారు. ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసి మొత్తం 24 అవినీతి కేసులు, 22 బినామీ కేసులు, 2 క్రిమినల్ కేసులు నమోదు చేసి 1,118 మందిపై చర్యలు ప్రారంభించినట్లు వివరించారు. వీరిలో ఎక్కువ మంది ఆబ్కారీ మరియు పోలీసు శాఖలకు చెందిన అధికారులే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కేసుల్లో 316 మంది ఆబ్కారీ అధికారులు, 132 మంది పోలీసు అధికారులు రాష్ట్ర పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద 2020లో కోరిన వివరాలకు 2026 ఫిబ్రవరి 5 సమాచారం అందిచారని పేర్కోన్నారు.

ఆర్టీఐ సమాధానం ప్రకారం, 316 మంది ఆబ్కారీ అధికారుల కేసుల్లో 211 ట్రిబ్యునల్‌కు, 75 కమిషనర్ ఫర్ ఎంక్వైరీకి, 2 డిపార్ట్‌మెంటల్ విచారణకు పంపినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ముగియలేదని తెలిపినట్లు పేర్కోన్నారు. పోలీసు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలు స్పష్టంగా లేవని వివరించారు. చాలా కాలంగా కేసులు పెండింగ్‌లో ఉండటం తీవ్ర విషయమని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుని విచారణను వేగవంతం చేయాలని ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తీవ్రమైన అవినీతి కేసులు దీర్ఘకాలం సాగకుండా ప్రత్యేక విధానాలు అమలు చేయాలని సూచించింది.

Next Story