ఎప్ స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు!

by Muthe.Rajitha |

ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి.

ఎప్ స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ ఫైల్స్‌లో రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారవేత్తలు, బిలియనీర్లు, ప్రముఖులు సహా అనేకమంది పేర్లు ఉండటంతో అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఈ ఫైల్స్ గురించి విస్తృతంగా కథనాలు, ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బౌద్ధ మత ఆధ్యాత్మిక గురువు దలైలామా పేరు 169 సార్లు ప్రస్తావించబడిందని వార్తలు రావడంతో పెను దుమారానికి దారి తీసింది. ఈ విషయం బయటకు పొక్కగానే దలైలామాకు కూడా ఈ కేసులతో సంబంధం ఉందన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు, గతంలో దలైలామాపై జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనలను ప్రస్తావిస్తూ, ఆయనను "పీడోఫైల్" అనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ డాక్యుమెంట్లలో అనేక సందర్భాల్లో సాక్ష్యాలు, ఇమెయిల్స్, ఫోన్ రికార్డులు, మీడియా కథనాలు, సాధారణ రిఫరెన్స్‌లుగా మాత్రమే ఆయన పేరు ప్రస్తావించబడినట్టు తెలుస్తోంది. దలైలామా పేరు ఉన్నప్పటికీ ఎప్ స్టీన్ తో నేరుగా ఎలాంటి సంబంధాలు ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవు. అంతెకాదు ఎలాంటి అధికారిక నివేదికలోనూ, కోర్టు డాక్యుమెంట్లలోనూ దలైలామాపై నేర ఆరోపణలు నమోదు కాలేదు. ఈ వ్యవహారంపై దలైలామా కార్యాలయం స్పందించింది.

"దలైలామా ప్రపంచవ్యాప్తంగా శాంతి, కరుణ, మానవ విలువల కోసం జీవితాంతం పనిచేసిన ఆధ్యాత్మిక నేత. ఆయనకు సంబంధించిన పేరు ఈ ఫైల్స్‌లో పలుమార్లు కనిపించడం అనేది సందర్భానుసారమైన ప్రస్తావన మాత్రమే కావచ్చు. కానీ కొంతమంది కావాలనే ఈ అంశాన్ని వక్రీకరించి, సంచలనం కోసం తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే విషయం. దయచేసి ఎవరూ కూడా ఈ అసత్య ప్రచారాలను నమ్మకూడదు. ఎప్ స్టీన్ ను ఎప్పుడూ దలైలామా కలవలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఎప్ స్టీన్ వ్యవహారానికి దలైలామాకు ఎలాంటి సంబంధం లేదు" అంటూ ప్రకటన జారీ చేసింది.

ఎప్ స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు ప్రస్తావించబడినంత మాత్రాన ఆయనకు ఎలాంటి నేర సంబంధం ఉందనే అధికారిక సమాచారం గాని, సాక్ష్యాలు గాని ఏవీ లేవు. ఈ ఫైల్స్‌లో ఎక్కువగా ఇమెయిల్స్, నోట్స్, చర్చల రికార్డులు, వాటిలో ఎవరో మూడో వ్యక్తులు మాట్లాడుకున్న సందర్భాల్లో "Dalai Lama" అనే పేరు వచ్చింది. కొన్ని ఇమెయిల్స్‌లో "దలైలామా ఒక కార్యక్రమానికి వస్తారు", "ఆయన్ని ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోంది" వంటి మాటలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ విడుదల అయితే నిజనిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story