- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియా ట్రోలింగ్.. పోలీసుల కేసు నమోదు
బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జి మాధవి దేవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై రిజిస్ట్రార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసు (Bandi Bhagirath case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం రాత్రి పోలీసులకు భగీరథ్ ను బండి సంజయ్ అప్పగించారు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జి పై సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిన వారికి హైకోర్టు రిజిస్ట్రార్ (High Court Registrar) షాక్ ఇచ్చారు. బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో (POCSO) కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర కలకలం రేపింది.
బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవి దేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ కొన్ని ఐటీ సెల్, సోషల్ మీడియా వేదికల్లో నిరాధారమైన, అనుచిత ఆరోపణలతో కూడిన పోస్టులను సర్క్యులేట్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవి దేవి ఈ పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్మియర్ క్యాంపెయిన్ తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. బాధితురాలి తరపు న్యాయవాదికి తన విచారణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తానే ఈ కేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అయితే న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ కొనసాగించిన ఆమె.. బండి భగీరథ్‌కు ఎలాంటి తాత్కాలిక ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
ఈ అవాస్తవ ప్రచారాల వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షికత పై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుందని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులను మానసికంగా దెబ్బతీసేందుకు, బెదిరించేందుకు (Browbeat) చేసే ఇటువంటి చర్యలను కఠినంగా అణచివేయాలని కోరారు. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పబ్లిక్ సర్వెంట్‌ను విధుల్లో ఆటంకపరచడం, అపవాదులు ప్రచారం చేయడం వంటి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించిన సదరు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను గుర్తించేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.






