కాటువేసి మళ్ళీ పగబట్టి వెంటాడిన తాచు పాము

by Muthe.Rajitha |

పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి వద్దకు మరో పాము రావడం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

కాటువేసి మళ్ళీ పగబట్టి వెంటాడిన తాచు పాము
X

దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి వద్దకు మరో పాము రావడం చూసి కుటుంబ సభ్యులు, రోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటన వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన రౌతు శివశ్రీనివాస్ అనే వ్యక్తిని మంగళవారం ఒక తాచుపాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే, అదే రోజు రాత్రి శివశ్రీనివాస్ చికిత్స పొందుతున్న వార్డు గుమ్మం వద్దకు అకస్మాత్తుగా మరో తాచుపాము వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై ఆ పామును చంపేశారు. కాగా ఇంట్లో కరిచిన పామే మళ్లీ ఆసుపత్రికి వచ్చిందని, అది పగ పట్టి ఉంటుందని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో చూపించే విధంగా పాములు పగ పడతాయన్న భయం వారిలో నెలకొంది.

ఈ ఘటనపై స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షుడు క్రాంతి స్పందిస్తూ, పాములు పగ పట్టడం అనేది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమేనని స్పష్టం చేశారు. పరిసరాల్లో పొదలు ఉండటం వల్ల సహజంగానే పాములు తిరుగుతుంటాయని. బాధితుడు ఉన్న చోటికే మరో పాము రావడం అనేది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమే అని తెలిపారు. వైద్యులు ప్రస్తుతం బాధితుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Next Story