శుభకార్యాల వేళ సామాన్యులకు భారీ ఊరట.. ఒక్కరోజే రూ. 85 వేలు తగ్గిన వెండి

by Malleboina Mahesh |   (  Updated:2026-02-11 11:54:43  IST  )

వెండి ధరలు శనివారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కిలో వెండి ధర రూ. 55,000 తగ్గగా, మధ్యాహ్న సమయానికి మరో రూ. 30,000 మేర పతనమైంది.

శుభకార్యాల వేళ సామాన్యులకు భారీ ఊరట.. ఒక్కరోజే రూ. 85 వేలు తగ్గిన వెండి
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన వెండి ధర ఈ రోజు ఊహించని స్థాయిలో పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో గత కొద్దివారాలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్న వెండి ధరలు శనివారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కిలో వెండి ధర రూ. 55,000 తగ్గగా, మధ్యాహ్న సమయానికి మరో రూ. 30,000 మేర పతనమైంది. దీంతో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వెండి ధర ఏకంగా రూ. 85,000 క్షీణించి, ప్రస్తుతం కిలో రూ. 3,20,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వారం ప్రారంభంలో రూ. 4 లక్షల మార్కును దాటి ఇన్వెస్టర్లను ఊరించిన వెండి, ఇప్పుడు అదే వేగంతో కిందికి దిగి రావడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

కాగా ఈ భారీ పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, టెక్నికల్ కారణాలు దోహదం చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న వార్తలతో డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం వెండి పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు, గత నెల రోజులుగా వెండి విపరీతమైన లాభాలను అందించడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపారు. ధరలు గరిష్ట స్థాయికి చేరిన వేళ ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో మార్కెట్‌లో వెండి విలువ ఒక్కసారిగా పడిపోయింది.

అయితే మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ తగ్గుదల తాత్కాలికమైన 'టెక్నికల్ కరెక్షన్' మాత్రమే అని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, సోలార్ ప్యానెల్స్ రంగంలో వెండికి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ధరలు మళ్లీ స్థిరపడే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story