ప్రజలే కాదు.. నేతలు మెచ్చిన రాజకీయ ధ్రువతార.. "శరద్ పవార్"

by Muthe.Rajitha |

మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ప్రభావం గట్టిగానే కొనసాగుతోంది. ఆయనను నేరుగా విమర్శించడానికి చాలా మంది నేతలు ఇప్పటికీ వెనుకంజ వేస్తున్నారు.

ప్రజలే కాదు.. నేతలు మెచ్చిన రాజకీయ ధ్రువతార.. శరద్ పవార్
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో శరద్ పవార్ ఒక ధ్రువతార వంటివారు. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన నిర్మించుకున్న అజేయమైన సామ్రాజ్యం, పదునైన వ్యూహాలు నేటికీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. శరద్ పవార్ కేవలం ఒక పార్టీ నాయకుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో బలమైన శక్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహారాష్ట్రలోని ప్రతి పల్లెటూరితోనూ, ప్రతి సహకార సంఘంతోనూ ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. పవార్‌కు ఉన్న అతిపెద్ద బలం ఆయన "వ్యక్తిగత సంబంధాలు". పార్టీలతో సంబంధం లేకుండా దేశంలోని అగ్రనేతలందరితో ఆయనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. అందుకే రాజకీయంగా శత్రువులైనప్పటికీ, వ్యక్తిగతంగా ఆయనను విరోధిగా మార్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఒకవేళ ఆయనను నేరుగా విమర్శిస్తే, అది మరాఠా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అక్కడి ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఈ భయమే ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, షిండే వర్గం నేతలను ఆయన విషయంలో ఆచితూచి అడుగులు వేసేలా చేస్తోంది.

పవార్‌ను ఎవరూ వేలెత్తి చూపకవడానికి మరో ప్రధాన కారణం ఆయనకు ఉన్న "సంక్షోభ నివారణ" నైపుణ్యం. ఏదైనా రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, మార్గం చూపగల ఏకైక నేత పవార్ అని ఢిల్లీ నుండి గల్లీ దాకా అందరికీ నమ్మకం. ఎన్‌సీపీ (NCP) చీలిన తర్వాత కూడా, అజిత్ పవార్ వర్గం పవార్‌పై వ్యక్తిగత విమర్శలు చేయకపోవడాన్ని మనం గమనించవచ్చు. దీనికి కారణం ఆయన పట్ల ఉన్న గౌరవం ఒకటైతే, భవిష్యత్తులో రాజకీయ అవసరాల కోసం మళ్లీ ఆయన పంచన చేరాల్సి వస్తుందనే ముందస్తు ఆలోచన మరొకటి. ఆయన వ్యూహాలు ఎంత నిగూఢంగా ఉంటాయంటే, పవార్ తదుపరి అడుగు ఏమిటో పక్కన ఉన్న వారికీ కూడా అంతుచిక్కదు అంటారు ఆయన సన్నిహితులు.

మహారాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చక్కెర పరిశ్రమ, సహకార బ్యాంకింగ్ రంగంపై పవార్‌కు ఉన్న పట్టు అసాధారణం. ఈ రంగాల ద్వారా ఆయన లక్షలాది మంది రైతుల జీవితాలను ప్రభావితం చేయగలరు. కాబట్టి, పవార్‌ను నొప్పించడం అంటే కేవలం ఒక వ్యక్తిని విమర్శించడం కాదు, రాష్ట్రంలోని ఒక బలమైన ఆర్థిక, సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడమే. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ, సభలు ముగియగానే ప్రత్యర్థులు కూడా ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో, ఎవరు శత్రువులవుతారో తెలియదు కాబట్టి, పవార్ లాంటి సీనియర్ నేతను తమ పక్షాన ఉంచుకోవడమే క్షేమమని మరాఠ పార్టీలు మాత్రమే కాదు జాతీయ పార్టీలు కూడా భావిస్తాయి.

Next Story