యాదగిరిగుట్ట ఆలయంలో సంచలనం.. విలువైన బంగారు, వెండి డాలర్లు మాయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 05:47:25  IST  )

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయమమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.

యాదగిరిగుట్ట ఆలయంలో సంచలనం.. విలువైన బంగారు, వెండి డాలర్లు మాయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయమమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఆలయానికి చెందిన ప్రచార శాఖలో (Publicity Department) నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్టాక్ రిజిస్టర్‌లోని లెక్కలకు, భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణకు ఆదేశం..

ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే బంగారం, వెండి డాలర్ల కనిపించకపోవడంపై ఇప్పటి వరకు ఆలయం అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

Next Story