- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేటెడ్, పార్టీ పదవుల కోసం సీనియర్ నేతల ప్రయత్నాలు
వరంగల్ కాంగ్రెస్ సీనియర్ల పదవుల వేట: రెండవ విడత నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో కీలక పదవుల కోసం అధిష్టానంపై నేతల ఒత్తిడి.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు పదవుల కోసం పట్టు పడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగిన తమకు తగిన అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. రెండవ దఫా భర్తీ చేసే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు అవకాశం ఇవ్వాలని పట్టు పడుతున్నారు. పార్టీ జిల్లా కమిటీల్లో కీలకమైన పదవుల్లో తమను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు ఏ అవకాశాలు ఇవ్వలేదని ఈ దఫా తమకు పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కలుస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పదవుల కోసం గట్టి పట్టు పడుతూ హైదరాబాద్ లో ఉంటూ ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండున్నరేళ్ల నిరీక్షణ..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లకు దగ్గర పడుతోంది. మరో రెండున్నరేళ్లే పదవీకాలం ఉండటంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు పదవుల కోసం పట్టుపడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడత ఉమ్మడి జిల్లా పరిధిలో కొంత మంది నేతలకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు. మిగతా సీనియర్ నేతలకు అవకాశం రాలేదు. వారిలో కొంత మందికి నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. మిగతా వారికి పదవులు రాలేదు. పార్టీ కోసం అధికారం లేని సమయంలో పదేళ్ల పాటు కార్యక్రమాలు నిర్వహించిన ఉమ్మడి జిల్లా నేతలు కీలకమైన పదవులను ఆశిస్తున్నారు.
రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల కోసం కొంత మంది నేతలు ప్రయత్నం చేస్తుండగా జిల్లా స్థాయి పదవుల కోసం మరికొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు ఉండే విధంగా రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. ఉమ్మడి జిల్లా నుంచి కొంత మందికి అవకాశం వచ్చింది. మిగతా వారికి జిల్లాస్థాయిలో మార్కెట్, గ్రంథాలయ సంస్థ కూడా ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు. మరికొంత మందికి కీలకమైన పార్టీ పదవులను ఇచ్చారు. మిగతా వారికి పదవులు రాలేదు. వీరంతా ఏళ్ల తరబడి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ అవకాశం వస్తుందని భావించారు.
మొదటి విడతలో పదవులు రాని నేతలంతా రెండో విడత పదవుల భర్తీలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి మార్కెట్ కమిటీలో అవకాశం రాకుంటే కనీసం పార్టీ జిల్లా కమిటీలో కీలక పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 14 జిల్లాల కమిటీలు ప్రకటించినందున ఉమ్మడి జిల్లా పరిధిలో నియమించే 6 జిల్లా కమిటీలో తగిన అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా అధ్యక్షులుగా పోటీపడ్డ వారు రాష్ట్రస్థాయి పదవులపై దృష్టి పెట్టగా మిగతా నేతలు జిల్లా కార్యవర్గంలో అవకాశాల కోసం పట్టుపడుతున్నారు. తమకు కీలకమైన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ పదవులు ఉన్న మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కొంత పనులు అయ్యే అవకాశం ఉండడంతో గట్టి పట్టు పడుతున్నారు.
రెండేళ్ల నుంచి పార్టీ నేతలుగా ఉన్న తమకు ఏం పనులు కావడం లేదని పార్టీ కోసం పదేళ్ల పాటు కష్టపడ్డామని ఆర్థికంగా నష్టపోయామని వారు వాపోతున్నారు. ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దఫా మిస్ అయితే మరో రెండేళ్ల పాటు పదవులు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే నామినేటెడ్ పదవులతో పాటు జిల్లాస్థాయి పదవుల భర్తీ ఉండటంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది నేతలు తమకు పదవులు రాకపోతే కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితుల్లో ఉన్నామని వివరిస్తున్నారు. అన్ని విధాల నష్టపోయిన తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఎవరికి పదవులు వస్తాయో ఎవరికి రావో వచ్చే రోజుల్లో తేలే అవకాశం ఉంది.






