సమ్మర్ కంటిన్యూ.. దంచికొడుతున్న ఎండలు

by Muthe.Rajitha |

సాధారణంగా జూన్, జులై మాసాలు వచ్చాయంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురవాలి.

సమ్మర్ కంటిన్యూ.. దంచికొడుతున్న ఎండలు
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా జూన్, జులై మాసాలు వచ్చాయంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురవాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వానాకాలం (Monsoon Season) ప్రవేశించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో మేఘాలు ముఖం చాటేయడంతో ఆకాశం నుండి వర్షపు జల్లులు కురవాల్సిన సమయంలో మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలాడుతుండటంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జులై మాసం నడుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదు కావడం వాతావరణ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జూలై నెలలోనూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎయిర్ కండిషనర్లు, కూలర్ల వినియోగం జులైలోనూ విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

వర్షాల కోసం వేయి కళ్లతో..

రుతుపవనాల ద్రోణిలో ఏర్పడిన మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో (El Nino) ప్రభావంతో వాతావరణంలో తగినంత తేమ లేకపోవడం వల్లే ఈ విధమైన పొడి వాతావరణం ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎండలు, ఉక్కపోత నుండి తమకు ఎప్పుడు ఉపశమనం కలుగుతుందా? మళ్లీ ముసురు పట్టి భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయా? అని ఉభయ రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం వేయి కళ్లతో ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఏవైనా అల్పపీడనాలు ఏర్పడితే తప్ప వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేస్తోంది.

Next Story