ఫేస్‌బుక్‌లో వలపు వల.. రూ.2.36 కోట్లు కొల్లగొట్టిన కిలాడీ

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో చిక్కుకుని రూ. 2.36 కోట్లు పోగొట్టుకున్నాడు.

ఫేస్‌బుక్‌లో వలపు వల.. రూ.2.36 కోట్లు కొల్లగొట్టిన కిలాడీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో చిక్కుకుని ఏకంగా రూ. 2.36 కోట్లు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది ఆగస్టులో 'కోరా' అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక గుర్తుతెలియని మహిళ, తాను సింగపూర్‌కు చెందిన వ్యక్తినని, ప్రస్తుతం ముంబయిలో పని చేస్తున్నానని సాఫ్ట్వేర్ వీరభద్రరావుతో స్నేహం కలిపింది. వీరిద్దరి మధ్య కొద్దిరోజుల పాటు చాటింగ్ చనువు పెరిగిన తర్వాత, ఆమె తన వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ప్రస్తుతం తన తల్లి, సవతి తండ్రితో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు నకిలీ కథ అల్లింది. ఈ క్రమంలో వీరభద్రరావును 'ఫేస్‌బుక్ స్టోర్' అనే ఒక గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో తన స్నేహితులంతా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు గడిస్తున్నారని ఆశ చూపింది. తొలుత ఆయన నిరాకరించినప్పటికీ, నిరంతర లాభాల ఆశ చూపడంతో చివరికి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు.

నిందితురాలు తన ఫేస్‌బుక్‌ స్టోరీ అంటూ ఒక APK ఫైల్‌ను పంపింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినప్పటికీ, నమ్మకంతో ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే అచ్చం ఫేస్‌బుక్ తరహాలోనే ఉండే ఒక నకిలీ ట్రేడింగ్ యాప్ ఆయన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది. దీనికి తోడు, జర్మనీకి చెందిన 'బెల్లా' అనే మరో మహిళా స్నేహితురాలిని పరిచయం చేసి, ఆమె సలహాల మేరకు వ్యాపారం చేయాలని సూచించింది. ఆ నకిలీ యాప్‌లో వస్తువులను కొనుగోలు చేస్తూ, తిరిగి విక్రయిస్తే లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 12 మధ్య కాలంలో బాధితుడు పలు విడతలుగా క్రిప్టో వాలెట్ ద్వారా మొత్తం రూ. 2.36 కోట్లను బదిలీ చేశాడు. ఆ యాప్‌లో లాభాలు వస్తున్నట్లు డిజిటల్ అంకెల్లో చూపించినప్పటికీ, అసలు సొమ్ము విత్‌డ్రా అవలేదు.

నిందితురాలు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో చివరికి తాను మోసపోయానని గ్రహించిన వీరభద్రరావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈ సొమ్ము ఇప్పటికే వివిధ విదేశీ ఖాతాలకు, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా ఇలాంటి ప్రాథమిక సైబర్ మోసాలకు గురవ్వడం అందరినీ షాక్ గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే గుర్తుతెలియని వ్యక్తుల 'ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల' పట్ల, ముఖ్యంగా విదేశీ పేర్లతో వచ్చే పరిచయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story