వార్నింగ్‌లకు భయపడను, వాస్తవాలు దాచను.. సీపీ సజ్జనార్ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు స్పందన!

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ అధికారులు విచారించారు.

వార్నింగ్‌లకు భయపడను, వాస్తవాలు దాచను.. సీపీ సజ్జనార్ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు స్పందన!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలుసని.. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని.. రేవంత్‌రెడ్డి బజారున పడేశారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్‌ను ఏర్పాటు చేశారని, నగర సీపీ సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని.. ఆయనపై ఏడు కేసులు ఉన్నాయని.. ఆయనకు సిట్ చీఫ్‌గా ఉండే అర్హత లేదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫైర్ అయ్యారు. అలాగే తనై ఏడు కేసులు ఉన్నాయని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదా క్షమాపణలు చెప్పలాని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులు (Notices) జారీ చేశారు.

ఈ నోటీసులు జారీపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్రంగా స్పందించారు. శనివారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కేటీఆర్, హరీష్ రావులకు ఈ వ్యవహారంతో సంబంధం లేకున్నా గంటల తరబడి విచారణ పేరిట వేధిస్తున్నారని, దీనిని ప్రశ్నించిన 12 గంటల్లోపే తనకు నోటీసులు రావడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తాను ఇటువంటి హెచ్చరికలకు భయపడబోనని, తన దగ్గర ఉన్న సమాచారంతోనే ధీటుగా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

అలాగే సీపీ సజ్జనార్‌ (CP Sajjanar)పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. 2015లో 'ఓటుకు నోటు' కేసు సమయంలో ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని, అప్పట్లో ఏపీలో నమోదైన కేసుల్లో నాటి ఇంటెలిజెన్స్ అధికారిగా సజ్జనార్ పాత్రపై చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు నేతృత్వం వహించడం నైతికంగా సరికాదన్నదే తన అభిప్రాయమని, ఇది రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ అని పేర్కొన్నారు. అలాగే, కేవలం ప్రభాకర్ రావు వంటి అధికారుల కుటుంబాలను, కింది స్థాయి సిబ్బందిని వేధించడం అన్యాయమని, నాటి ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌ (Phone tapping)కు పాల్పడుతోందని తాను ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆఘమేఘాల మీద నోటీసులు ఇస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తీవ్రంగా ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని ఆయన సూచించారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలు గోప్యంగా ఉండాల్సింది పోయి, గాంధీ భవన్ (కాంగ్రెస్ కార్యాలయం)లో లైవ్ కామెంటరీలా చర్చకు రావడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.

Next Story