రేవంత్ సర్కార్ వర్సెస్ ఏబీవీపీ.. ఫీజుల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు!

by Malleboina Mahesh |

ఇంజనీరింగ్ ఫీజుల పెంపును నిలిపివేయాలని ఏబీవీపీ డిమాండ్. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందం ఉందని మాచెర్ల రాంబాబు ఆరోపణలు. ఫీజుల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు!

రేవంత్ సర్కార్ వర్సెస్ ఏబీవీపీ.. ఫీజుల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ TAFRC ప్రభుత్వానికి నివేదించడాన్ని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఫీజుల పెంపు ప్రతిపాదనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫీజుల పెంపు వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనలను నిలిపివేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేటు కళాశాలలు దోచుకుంటున్నాయని విమర్శించి, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ ప్రాతిపదికన 63 కళాశాలల్లో భారీగా ఫీజుల పెంపునకు మొగ్గు చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రికి, యాజమాన్యాలకు మధ్య రహస్య ఒప్పందం ఉందని, కోట్ల రూపాయలు చేతులు మారాయన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల ఆడిట్ రిపోర్ట్‌లను తక్షణమే బహిర్గతపర్చాలని, తప్పుడు నివేదికలు ఇచ్చిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని రాంబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు పెంచకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఫీజులు ఎలా పెంచుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం 19 కళాశాలల్లో ఫీజులు తగ్గించడం అనేది విమర్శల నుంచి తప్పించుకోవడానికి చేసిన జిమ్మిక్కు అని, తన అనుయాయుల కళాశాలలకు లబ్ధి చేకూర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపును విరమించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు హెచ్చరించారు.

Next Story