ఆ ప్రాజెక్టులో తగ్గిన నీరు.. కన్నీటి పర్యంతం అవుతున్న ప్రజలు

by Disha Web Desk 2 |
ఆ ప్రాజెక్టులో తగ్గిన నీరు.. కన్నీటి పర్యంతం అవుతున్న ప్రజలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దశాబ్దం నాటి గత వైభవపు ఆనవాళ్లు తమ కళ్లముందు సాక్షాత్కరించడంతో వారిలో కన్నీరు ఆగడం లేదు. తరతరాలుగా పెనవేసుకున్న అనుబంధాలు వారి మదిలో మెదిలాయి. జలాశయం కోసం చేను చెలక, ఇళ్లు అన్నీ వదిలేసి గుండె దీటువు చేసుకుని సర్కారుకు అప్పగించిన తమ స్థిరాస్థుల తాలుకు ఆనవాల్లు బయట పడడంతో వాటిని చూస్తూ ఆ గ్రామాల ప్రజలు అలనాటి ఆనందాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఎంఎండీలో తగ్గిన నీటి మట్టం..

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం భూమితో పాటు గ్రామాలకు గ్రామాలనే సేకరించింది. పచ్చని పంట పొలాలతో, గ్రామస్థుల సందడితో కళకళలాడిన ఆ పల్లెలు నేడు శిథిలాలుగా వెలుగులోకి వచ్చాయి. పునరావాస కాలనీల్లో జీవనం సాగిస్తున్న వారంతా మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో తమ ఊర్లతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుండి ఇటీవలే అధికారులు మల్లన్నసాగర్‌కు సుమారు 16 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో మిడ్ మానేరులో నీరు గణనీయంగా తగ్గిపోవడంతో దశాబ్దం క్రితం నీట మునిగిన ఇళ్ల తాలుకు ఆనవాళ్లు బయటకొచ్చాయి. గత రెండేళ్లుగా ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నింపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీలోని గాయిత్రీ పంప్ హౌస్ నుండి నీటిని మిడ్ మానేరుకు తరలించారు. ఇప్పటి వరకు ఇక్కడి నుండి లోయర్ మానేరు డ్యాం, అన్నపూర్ణ రిజర్వాయర్లకు మాత్రమే నీటిని తరలించేవారు. కానీ, ఈసారి సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తి కావడంతో అక్కడకు కూడా నీటిని తరలించే ప్రక్రియను ఆరంభించారు. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు నీరు లేక వెలవెల బోయింది.

27.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కేవలం 11.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయంలో నీటి మట్టం తగ్గిపోవడంతో గతంలో ఈ ప్రాజెక్టులో మునిగిపోయిన గ్రామాలన్నీ కనిపిస్తున్నాయి. అయితే, ఆనాడు పచ్చని పంటలతో, ఎంతో సందడిగా కనిపించే గ్రామాలకు చెందిన శిథిలమైన గోడలు, ఎండిపోయిన చెట్లు, ఎటు చూసినా బోసిపోయినట్టుగా దర్శనిమస్తోంది. సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజ్‌పల్లి, వరదవెల్లి, శాభాష్‌పల్లితో పాటు వేములవాడ మండలంలోని అనుపురం, సంకెపల్లి, ఆరెపల్లి, కొడిముంజ, రుద్రవరం, తంగళ్లపల్లి మండంలోని చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రంవానిపల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురి కాగా, ఇల్లంతకుంట మండలంలోని మాన్వాడ పాక్షికంగా ప్రాజెక్టుకింద మునిగిపోయింది. వీటిలో ఇప్పుడు నీలోజిపల్లి, కొదురుపాక, రుద్రవరం, శాభాష్ పల్లి, వరదవెల్లి గ్రామాలు నీరు తగ్గిపోవడంతో బాహ్య ప్రపంచానికి కనిపిస్తున్నాయి. అలనాటి జ్ఞాపకాలన్నీ చెదిరిపోయి ప్రళయ బీభత్సం తర్వాత ఏర్పడ్డ ప్రశాంతతలో కనిపిస్తున్నట్టుగా అలనాటి గ్రామాల శిథిలాలు వెలుగులోకి రావడంతో గత కాలపు నాటి తీపి గుర్తులను నెమరువేసుకుంటూ ముంపునకు గురైన గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


Next Story