కనుమరుగు కానున్న నోట్లు.. పట్టణాల్లో డిజిటల్ రూపీ వైపు RBI అడుగులు

by Muthe.Rajitha |

ప్రజల్లో కరెన్సీ వినియోగం తగ్గించి, డిజిటల్ మనీ వినియోగించేలా ఆర్బీఐ అడుగులు వేస్తోంది.

కనుమరుగు కానున్న నోట్లు.. పట్టణాల్లో డిజిటల్ రూపీ వైపు RBI అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : నగదు రహిత భారత్ లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అడుగులు వేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) అయినటువంటి డిజిటల్ రూపాయి వినియోగాన్ని విస్తరించేందుకు కీలక చర్యలు చేపట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిజిటల్ దిశగా తీసుకెళ్లడమే ఈ ప్రయత్నం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరెన్సీ వినియోగాన్ని తగ్గించి, సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీల వైపు ప్రజలను మళ్లించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ రూపాయి అంటే మన చేతిలో ఉండే కరెన్సీ నోట్లు, నాణేల మాదిరిగానే ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక డిజిటల్ కరెన్సీ. ఇది వాలెట్ ఆధారిత వ్యవస్థలో పనిచేస్తుంది. యూపీఐ (UPI) ద్వారా మనం బ్యాంకు ఖాతా నుండి డబ్బు బదిలీ చేస్తాము. కానీ డిజిటల్ రూపాయిలో ఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ నోట్లు నేరుగా ఒక డిజిటల్ వాలెట్ నుండి మరొక వాలెట్‌కు మారుతాయి. అంటే ఇది కేవలం చెల్లింపు పద్ధతి కాదు, స్వయంగా డబ్బే.

రిటైల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ, బ్యాంకులు కలిసి పలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. డిజిటల్ పద్దతి ద్వారా కిరాణా దుకాణం, షాపింగ్ మాల్, ఇతర రిటైల్ స్టోర్లలో చేసే చెల్లింపులపై వినియోగదారులకు 1% నుంచి 2% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నారు. చిన్న వ్యాపారులు డిజిటల్ మనీ స్వీకరిస్తే ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. అంతేకాకుండా నెలకు నిర్దిష్ట పరిమితికి మించి డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ట్యాక్స్ రాయితీలు, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించే ప్రణాళికలను కూడా బ్యాంకులు సిద్ధం చేస్తున్నాయి. ఆర్బీఐ తీసుకురానున్న మరో ముఖ్యమైన ఫీచర్ ఆఫ్‌లైన్ చెల్లింపులు. ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా 'ట్యాప్ అండ్ పే' సదుపాయం ద్వారా డిజిటల్ మనీని ఉపయోగించవచ్చు. ఇది చిన్న కిరాణా దుకాణాలు, బస్సులు, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం ఫిజికల్ కరెన్సీ ముద్రణ, రవాణా ఖర్చులు భారీగా ఉండటమే. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నగదు నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ రూపాయి వినియోగం పెరిగితే కరెన్సీ ముద్రణ, భద్రత, రవాణా వంటి ఖర్చులు తగ్గుతాయి. అలాగే నకిలీ నోట్ల సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. ప్రతి లావాదేవీ డిజిటల్‌గా నమోదవడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఆర్థిక నేరాలు తగ్గుతాయి. బ్యాంకింగ్ సర్వర్లపై ఒత్తిడి కూడా తగ్గి, వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. యూపీఐకి ఇది పోటీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. యూపీఐ ఒక చెల్లింపు వేదిక కాగా, డిజిటల్ రూపాయి స్వయంగా డబ్బు. భవిష్యత్తులో యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారానే డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసేలా సాంకేతిక సమన్వయం ఇప్పటికే జరుగుతోంది. 2026 చివరి నాటికి పట్టణ ప్రాంతాల్లో కనీసం 50% నగదు లావాదేవీలను డిజిటల్ రూపాయిలోకి మార్చడమే లక్ష్యంగా ఈ విస్తరణ కొనసాగుతోంది. “జేబులో నోట్ల కంటే మొబైల్‌లో డిజిటల్ మనీ సురక్షితం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్బీఐ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపడుతోంది.

Next Story