ఈహెచ్‌సీటీ మావల్ల కాదు.. చేతులెత్తేసిన ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలైతే తాము సేవలు అందించలేమని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టంచేసింది.

ఈహెచ్‌సీటీ మావల్ల కాదు.. చేతులెత్తేసిన ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్/ఈహెచ్‌సీటీ) ప్రస్తుత రూపంలో అమలైతే తాము సేవలు అందించలేమని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టాన్హా) స్పష్టంచేసింది. ఈ మేరకు టాన్హా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈహెచ్‌సీటీ సీఈఓ హన్మంతుతో పాటు ఇతర ఉన్నతాధికారులను కలిసి నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

నూతన విధానంలో ప్రతిపాదించిన సీజీహెచ్ఎస్ టారిఫ్ ధరలు ప్రస్తుత ఆరోగ్య శ్రీ, పాత ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్ల కంటే చాలా తక్కువగా ఉన్నాయని, ఈ రేట్లతో వైద్యం అందించడం ఆసుపత్రులకు ఆర్థికంగా సాధ్యం కాదని అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ప్యాకేజీ ధరలను ఇష్టానుసారంగా తగ్గిస్తే నూతన విధానంలో భాగస్వాములు కాలేమని నెట్‌వర్క్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. మొత్తంగా చూస్తే, కొత్త ఈహెచ్ఎస్ ప్యాకేజీల విషయంలో రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలంగా లేదు.

‘టాన్హా’ ప్రధాన డిమాండ్లు...

ధరల పునఃసమీక్ష : నూతన ఆరోగ్య పథకానికి సంబంధించిన ప్యాకేజీ ధరలను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా, క్షేత్రస్థాయి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో పునఃసమీక్షించాలి.

కమిటీల్లో ప్రాతినిధ్యం : విధానపరమైన నిర్ణయాలు, కార్యాచరణ ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా గవర్నింగ్ బోర్డుతో పాటు వివిధ కీలక కమిటీల్లో విభిన్న వైద్య విభాగాలకు చెందిన కనీసం 10 మంది నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులకు చోటు కల్పించాలి.

గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం : గత ఈహెచ్ఎస్ విధానంలో ప్రధాన లోపంగా మారిన సమస్యల పరిష్కార వేదికను ఈసారి బలోపేతం చేయాలి. నూతన పథకంలో పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం ఏర్పాటు చేయాలి.

పాత బకాయిల విడుదల : నూతన విధానాన్ని అమలు చేయడానికి ముందే పాత ఈహెచ్ఎస్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి ఆసుపత్రులను ఆర్థికంగా ఆదుకోవాలనే అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు.

సమస్య పరిష్కరించకుంటే పథకం విఫలమవ్వడం ఖాయం..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందుతున్న వైద్య సేవల్లో దాదాపు 70 నుంచి 80 శాతం సేవలను తమ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలోని ఆసుపత్రులే అందిస్తున్నాయని ‘టాన్హా’ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలు తమ ఆందోళనలను అర్థం చేసుకోవాలని, నూతన పథకాన్ని ప్రారంభించే ముందు నెట్‌వర్క్ ఆసుపత్రులతో సమగ్ర సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేసింది. గత 2 నెలలుగా ఈ సమస్యలను ఈహెచ్‌సీటీ సీఈఓతో పాటు ఇతర ఉన్నతాధికారుల దృష్టికి నిరంతరం తీసుకెళ్తున్నా ఎలాంటి సానుకూల చర్యలు తీసుకోకపోవడంపై అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పైస్థాయి అధికారులను కలవడానికి సమయం కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేసింది. పథకం అమలుకు ముందే సమస్యలను పరిష్కరించకపోతే పాత ఈహెచ్ఎస్ లాగే ఇది కూడా విఫలమవుతుందని, తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని డా. వద్దిరాజు రాకేష్, టాన్హా కార్యవర్గ సభ్యులు హెచ్చరించారు.

Next Story