ఇంధన కొరత: ఖాళీ స్టేడియాల్లోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు

by Malleboina Mahesh |

మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన కొరతతో PSL 2026 మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని PCB నిర్ణయం. ప్రారంభ వేడుక రద్దు, వేదికలు తగ్గింపు.

ఇంధన కొరత: ఖాళీ స్టేడియాల్లోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా,ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా పాకిస్థాన్‌లో తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 తీవ్రంగా పడింది. దీంతో 2026 సీజన్‌పై పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు అమలులో ఉన్నందున, ప్రజల రాకపోకలను తగ్గించేందుకు ప్రారంభ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో (Behind Closed Doors) నిర్వహించనున్నట్లు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం ప్రకటించారు. అంతేకాకుండా, గతంలో ఆరు నగరాల్లో నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ, వనరులను ఆదా చేసేందుకు ఇప్పుడు కేవలం లాహోర్, కరాచీ నగరాలకు మాత్రమే వేదికలను పరిమితం చేశారు. లాహోర్‌లో వైభవంగా జరగాల్సిన ప్రారంభ వేడుకను కూడా బోర్డు రద్దు చేసింది.

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో, పరిస్థితులు మెరుగు పడే వరకు ప్రేక్షకులను అనుమతించబోమని నఖ్వీ స్పష్టం చేశారు. ఒకవైపు ప్రజలను ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరుతూ, మరోవైపు స్టేడియాలకు వేల సంఖ్యలో రావాలని పిలవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు 72 గంటల్లోపు పూర్తి నగదును రీఫండ్ చేస్తామని, ఫ్రాంచైజీలకు జరిగే ఆదాయ నష్టాన్ని బోర్డు భరిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇదే సమయంలో ఐపీఎల్ కోసం పిఎస్ఎల్ ఒప్పందాలను కాదనుకున్న విదేశీ ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ బోర్డు హెచ్చరించింది.

Next Story