కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తం..

by Dishanational4 |
కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తం..
X

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక, రాహుల్ తదితర పార్టీ నేతల అరెస్టు ఘటనలతో శుక్రవారం ఢిల్లీ అట్టుడికిపోయింది. నిషేధాజ్ఞలు ధిక్కరించి, బ్యారికేడ్లు దూకి మరీ రోడ్డుమీద కూర్చుని ధర్నా చేసిన ప్రియాంకను ఢిల్లీ పోలీసులు బలవంతంగా లాక్కుని వెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి.

అంతకు ముందు ప్రజలపై అధిక ధరల భారం మోపిన ఎన్డీయే పాలనను నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రపతి భవన్‌ని, ప్రధాని మోడీ నివాసాన్ని కూడా ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ప్రయత్నించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రియాంక గాంధీ ఆ ఆంక్షలను ధిక్కరించి బ్యారికేడ్ల పైనుంచి దూకి రోడ్డుమీద కూర్చోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిషేధాజ్ఞలు ధిక్కరించిన ప్రియాంక

ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధింపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా శుక్రవారం నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై విమర్శల దాడితో విరుచుకు పడ్డారు. మరోవైపున ఈ అంశంపై ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని దిగ్బంధించాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని కూడా ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు శశిధరూర్ వంటి పలువురు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధరలపై నిరసన తెలిపితే ఇంత దౌర్జన్యమా.. ప్రియాంక

ధరల పెరుగుదలను కేంద్ర మంత్రులు ఏమాత్రం చూడలేకపోతున్నారని, ప్రధాని ఇంటికెళ్లి చూపించాలనుకున్నామని ప్రియాంక ఆందోళనల సమయంలో మాట్లాడారు. ఉన్న పరిస్థితిని వివరించాలనుకుంటే దౌర్జన్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. నిషేధాజ్ఞల నేపథ్యంలో ఢిల్లీలో పారామిలటరీ బలగాలను భారీ స్థాయిలో మోహరించారు. బ్యారికేడ్లకు మరోవైపున మహిళా పారామిలటరీ పోలీసులను నియమించి మరీ నిరసనలను అడ్డుకున్నారు. అనంతరం ప్రియాంక, రాహుల్ గాంధీలను అరెస్టు చేసి న్యూ పోలీస్ లైన్స్ కింగ్‌‍స్వే క్యాంప్ స్టేషన్‌లో ఉంచారు.

ఎంతగా విమర్శిస్తే అంతగా టార్గెట్ చేస్తున్నారు.. రాహుల్

కాగా, నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై తాను ఏ స్థాయిలో దాడి చేస్తే ఆ స్థాయిలో తనను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోదని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయిందని, దేశం నియంతృత్వంలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు.

నలుగురు వ్యక్తుల నియంత్రృత్వంలో దేశం మగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. భారతీయులుగా మనం ప్రజాస్వామ్యం మరణించడానికి సాక్షీభూతులుగా ఉంటున్నాం. దాదాపు వందేళ్లుగా భారత్ ఇటుకపై ఇటుక చేర్చుకుంటూ నిర్మించినదంతా ఇప్పుడు మన కళ్లముందే ధ్వంసమైపోతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వ భావనకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతి ఒక్కరిపై క్రూరంగా దాడి చేస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని, అరెస్టు చేసి చావబాదుతున్నారని చెప్పారు. కేంద్రం తనను లక్ష్యం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందని, మీకిష్టమైన దాడులు తనపై చేసుకోవచ్చని రాహుల్ పేర్కొన్నారు.

మరోవైపున ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోని నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. నాయకుల అరెస్టుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేశారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులను, తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చండీగర్‌లో వాటర్ కేనన్లను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో బిహారా, రాజస్తాన్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి మరీ నిరసనలు మొదలెట్టారు. ప్రియాంక్, రాహుల్‌లను నిర్బంధించి గంటలపాటు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Next Story

Most Viewed