Mount Erebus : బంగారం వెదజల్లుతున్న వింత పర్వతం.. రోజుకూ ఎంతంటే..

by Dishafeatures2 |
Mount Erebus : బంగారం వెదజల్లుతున్న వింత పర్వతం.. రోజుకూ ఎంతంటే..
X

దిశ, ఫీచర్స్ : పర్వతాలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలు, అందమైన, ఎత్తైన కొండలు ఎక్కడున్నా ఆకట్టుకోవడం సహజం. కానీ ఆ దేశంలోని ఒక పర్వతం మాత్రం అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే అది నిరంతరం బంగారాన్ని బయటకు వెదజల్లుతోంది. వినడానికి వింతగా అనిపిస్తున్న ఆ పర్వతం మరెక్కడో కాదు, అంటార్కిటికాలో ఉంది. ఎరేబస్ అగ్ని పర్వతం గురించి ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు. దాని నుంచి నిరంతరం బంగారు వర్షం కురుస్తుండటమే ఇందుకు కారణం. వాస్తవం ఏంటంటే.. అంటార్కిటికాలోని ఈ ఎరేబస్ అగ్ని పర్వతం నుంచి బంగారం కరిగిపోయి ద్రవ రూపంలో, రేణువుల రూపంలో బయటకు పెల్లుబుకుతూ ఉంటుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, దాంతోపాటు విలువైన ఇతర ఖనిజాలు కూడా బయటకు వస్తుంటాయని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) పేర్కొన్నది. ఆ పర్వతానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.

నాసా ప్రకారం అంటార్కిటికాలోని ఎరేబస్ అగ్ని పర్వతం భూమి మధ్యలోంచి పైకి ఉబుకుతున్న లావా ద్వారా ఏర్పడింది. అయితే మిగతా అగ్ని పర్వతాలకు ఇది భిన్నం. ఎందుకంటే మిగతా చోట్ల అగ్ని జ్వాలలు కనిపిస్తే ఇక్కడ మాత్రం దాంతోపాటు ద్రవరూపంలోని బంగారం, ఖనిజాలు కనిపిస్తాయి. రోజూ దాదాపు 80 గ్రాముల బంగారు బయటకు వస్తోందని, దీని విలువ సుమారు ఆరు వేలడార్లకు పైగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ బంగారం బయటకు వెదజల్లుతున్నప్పటికీ, దానిని సేకరించే ధైర్యం ఎవరూ చేయరు. ఎందుకంటే దాని చుట్టూ అత్యంత వేడిగా మరుగుతున్న లావా ఉంటుంది. కాగా కొన్ని బంగారు రేణువులు వాయు పీడనంవల్ల అప్పుడప్పుడూ పైకి ఎగిసిపడుతుంటాయి. ఈ దృశ్యానికి సంబంధించి అంతరిక్షం నుంచి తీసిన శాటిలైట్ చిత్రాలను తాజాగా నాసా విడుదల చేసింది.



Next Story

Most Viewed