- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' 130వ ఎపిసోడ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమం భారతదేశపు మొట్టమొదటి "రేడియో-విజువల్" ప్రజా ప్రసార కార్యక్రమంగా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' ('Mann Ki Baat') కార్యక్రమం భారతదేశపు మొట్టమొదటి "రేడియో-విజువల్" ప్రజా ప్రసార కార్యక్రమంగా నిలిచింది. 2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం, సామాన్య ప్రజలతో నేరుగా సంభాషించడానికి, దేశాభివృద్ధిలో పౌరులను భాగస్వామ్యులను చేయడానికి ఒక శక్తివంతమైన వేదికగా మారింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే ఈ ప్రసంగం, హిందీతో పాటు 22 జాతీయ భాషలు, 29 మాండలికాలు, 11 అంతర్జాతీయ భాషల్లో ప్రసారం అవుతుంది.
ఈ 'మన్ కీ బాత్' 130వ ఎపిసోడ్ ('Mann Ki Baat' Episode 130) సందర్భంగా ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "రేపు మనం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇదే రోజున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జనవరి 26వ తేదీ. మన రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించే అవకాశాన్ని మనకు కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. "మనం పుట్టినరోజులను ఎలాగైతే జరుపుకుంటామో, అదే విధంగా ఒక యువకుడు మొదటిసారిగా ఓటరుగా మారినప్పుడు, ఆ పరిసర ప్రాంతం, గ్రామం, నగరం అంతా కలిసి వారిని అభినందించి స్వీట్లు పంపిణీ చేయాలి. ఇది ఓటింగ్ పట్ల అవగాహన ను పెంచుతుంది. ఓటరుగా ఉండటం ఎంత ముఖ్యమో అనే భావనను బలోపేతం చేస్తుందని ప్రధాని తెలిపారు.
అలాగే "ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ధోరణిని నేను గమనిస్తున్నాను. ప్రజలు 2016 నాటి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అదే స్ఫూర్తితో, ఈరోజు నేను కూడా నా జ్ఞాపకం ఒకదానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పదేళ్ల క్రితం, జనవరి 2016 లో మనం ఒక ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించాం. అప్పట్లో అది చిన్నదే అయినప్పటికీ, దేశ భవిష్యత్తుకు, యువ తరానికి అది చాలా ముఖ్యమని మేము గుర్తించాము. నేడు, భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదిగింది. ఈ స్టార్టప్‌లు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ఊహించని రంగాల్లో కూడా ఇవి నేడు పనిచేస్తున్నాయి."
"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్పేస్, అణుశక్తి, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ - ఇలా మీరు ఏ రంగం పేరు చెప్పినా, అక్కడ ఏదో ఒక భారతీయ స్టార్టప్ పనిచేస్తూ కనిపిస్తుంది. ఏదో ఒక స్టార్టప్‌తో సంబంధం ఉన్న లేదా సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభించాలనుకుంటున్న నా యువ మిత్రులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. మనం దేనిని తయారు చేసినా, దాని నాణ్యతను మెరుగుపరచాలని సంకల్పించుకుందాం. మన వస్త్రాలు, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ లేదా ప్యాకేజింగ్ ఏదైనా సరే.. 'భారతీయ ఉత్పత్తి' అంటే 'అత్యున్నత నాణ్యత' అనే గుర్తింపు రావాలి. అత్యుత్తమ ప్రమాణాలనే (Excellence) మన కొలమానంగా మార్చుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు.
"భారతీయ పండుగలను ప్రపంచంలోని ప్రతి మూలలో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. మన భారత సంతతికి చెందిన సోదర సోదరీమణులు అన్ని రకాల సాంస్కృతిక వైభవాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మలేషియాలోని మన భారతీయ సమాజం కూడా ఈ విషయంలో ప్రశంసనీయమైన కృషి చేస్తోంది. మలేషియాలో 500 కంటే ఎక్కువ తమిళ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ తమిళ భాషను బోధించడమే కాకుండా, ఇతర సబ్జెక్టులను కూడా తమిళంలోనే బోధిస్తున్నారు. అంతేకాకుండా, తెలుగు, పంజాబీ భాషలతో పాటు ఇతర భారతీయ భాషలపై కూడా అక్కడ చాలా దృష్టి సారిస్తున్నారు.
'మలేషియా ఇండియా హెరిటేజ్ సొసైటీ' (Malaysia India Heritage Society) ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత నెలలో, మలేషియాలో 'లాల్ పాడ్ చీర' (Lal Paad Saree) ఐకానిక్ వాక్ నిర్వహించబడింది. ఈ చీరకు మన బెంగాల్ సంస్కృతితో ప్రత్యేక సంబంధం ఉంది. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ చీరను ధరించి పాల్గొనడం ఒక రికార్డుగా నిలిచింది. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా నమోదైందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
అలాగే "శతాబ్దాలుగా భజనలు, కీర్తనలు మన సంస్కృతికి ఆత్మ గా నిలిచాయి. నేటి యువత తమ అనుభవంలోకి, జీవనశైలిలోకి ఈ భక్తి భావాన్ని కొత్తగా మేళవించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో యువత పెద్ద ఎత్తున గుమిగూడు తున్నారు. వేదికలు అద్భుతంగా అలంకరించబడుతున్నాయి, ఆర్భాటాలు కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణం ఒక భారీ సంగీత కచేరీని (Concert) తలపిస్తోంది. కానీ అక్కడ ఆలపిస్తున్నవి మాత్రం భజనలే. ఈ సరికొత్త ధోరణిని నేడు 'భజన క్లబ్బింగ్' (Bhajan Clubbing) అని పిలుస్తున్నారు. ముఖ్యంగా 'జెన్ జీ' (Gen Z) యువతలో ఇది విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది."
"భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు దీనిని ఎంతో ఆసక్తితో చూస్తాయి. ఎన్నో దేశాల్లో ఇటువంటి కుటుంబ వ్యవస్థలకు ఎంతో గౌరవం ఉంది. కేవలం కొన్ని రోజుల క్రితమే, నా సోదరుడు, యూఏఈ (UAE) అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు. 2026 సంవత్సరాన్ని యూఏఈ 'కుటుంబ సంవత్సరం' (Year of the Family) గా జరుపుకుంటున్నట్లు ఆయన నాకు తెలియజేశారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
అలాగే.. "గుజరాత్‌లోని బెహరాజీలో ఉన్న చందన్‌కి (Chandanki) గ్రామ సంప్రదాయం గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ప్రత్యేకమైనదని, ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, తమ ఇళ్లలో వంట చేసుకోరు. దీనికి కారణం ఆ గ్రామంలోని అద్భుతమైన కమ్యూనిటీ కిచెన్ (సామాజిక వంటశాల) ఉంటుంది. మొత్తం గ్రామానికి సరిపడా ఆహారం ఈ వంటశాలలోనే తయారవుతుంది. గ్రామస్థులందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. గత 15 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ చొరవ ప్రజలను కలపడమే కాకుండా, వారిలో ఒక కుటుంబ భావనను పెంపొందిస్తోందని ప్రధాని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ తన 'మన్ కీ బాత్' 130వ ఎపిసోడ్ సందర్భంగా "పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ నివాసి అయిన బినోయ్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆయన తన జిల్లాను పచ్చగా మార్చడానికి ఒంటరి పోరాటం చేస్తున్నారు. బినోయ్ దాస్ స్వయంగా వేలాది మొక్కలను నాటారు. మొక్కలను కొనుగోలు చేయడం, నాటడం, వాటిని సంరక్షించడానియ్యే మొత్తం ఖర్చును ఆయనే స్వయంగా భరిస్తున్నారు. అవసరమైన చోట ఆయన స్థానిక ప్రజలు, విద్యార్థులు, మున్సిపల్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన నిరంతర కృషి వల్ల రహదారుల వెంబడి పచ్చదనం గణనీయంగా మెరుగుపడిందని ప్రధాని గుర్తు చేశారు.
అలాగే మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన జగదీష్ ప్రసాద్ అహిర్వార్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. అటవీ శాఖలో బీట్-గార్డ్‌గా పనిచేస్తున్న ఆయన అడవిలో ఉన్న అనేక ఔషధ మొక్కల సమాచారం ఎక్కడ క్రమబద్ధంగా నమోదు కాలేదని ఆయన ఒకసారి గుర్తించారు. దీంతో జగదీష్ స్వయంగా ఆ మొక్కలను గుర్తించి, రికార్డు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 125కు పైగా ఔషధ మొక్కలను గుర్తించారు. ప్రతి మొక్కకు సంబంధించిన ఫోటో, పేరు, దాని ఉపయోగాలు, అవి ఎక్కడ దొరుకుతాయి అనే పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆయన సేకరించిన ఈ అమూల్యమైన సమాచారాన్ని అటవీ శాఖ ఒక పుస్తక రూపంలో ప్రచురించినట్లు తెలియాజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తీవ్రమైన కరువు పరిస్థితులతో సతమతమవుతున్న ప్రాంతం. ఇక్కడి నేల ఎర్రగా, ఇసుకతో కూడి ఉండటం వల్ల ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి (అనంతపురం) చాలా ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పాటు వర్షాలు పడవు. ఈ సమస్యను పరిష్కరించడానికి, స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని జలాశయాలను శుభ్రం చేయాలని సంకల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో అక్కడ 'అనంత నీరు సంరక్షణం ప్రాజెక్ట్' ('Ananta Water Conservation Project') ప్రారంభమైంది. దీని ద్వారా ఇప్పటివరకు 10 కంటే ఎక్కువ జలాశయాలకు పునరుజ్జీవం పోశారు. అదే సమయంలో, ఈ ప్రాంతంలో 7,000 కంటే ఎక్కువ మొక్కలను కూడా నాటారని ప్రధాని మోడీ ప్రత్యేకంగా గుర్తు చేశారు.
చివరగా.. "వచ్చే నెలలో 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్' (India AI Impact Summit) జరగబోతోందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, ముఖ్యంగా సాంకేతిక రంగంలోని దిగ్గజాలు ఈ సదస్సు కోసం భారతదేశానికి రానున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో భారతదేశం సాధించిన పురోగతిని, విజయాలను ఈ సదస్సు ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.






