'మెట్రో'ల్లో ప్రీ-వెడ్డింగ్ షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

మెట్రో రైళ్లల్లో ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్లు, సినిమా షూటింగులు వంటివి చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

మెట్రోల్లో ప్రీ-వెడ్డింగ్ షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : మెట్రో రైళ్లల్లో ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్లు, సినిమా షూటింగులు వంటివి చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే అది మన రాష్ట్రంలో కాదు మధ్యప్రదేశ్ లో. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (MPMRCL) తన ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవడానికి, అలాగే నష్టాల నుండి గట్టెక్కడానికి 'సెలబ్రేషన్ ఆన్ వీల్స్' (Celebration on Wheels) అనే వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది. భోపాల్ ఇండోర్ లోని కొన్ని ప్రత్యేక మెట్రో రైళ్లలో కోచ్‌లను వివిధ రకాల వేడుకలకు మరియు వాణిజ్య కార్యకలాపాలకు వేదికలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో మెట్రోకు వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఈ అదనపు ఆదాయ మార్గం ఎంతో దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది. ఈ పథకం కింద పుట్టినరోజు వేడుకలు, కిట్టీ పార్టీలు వంటి వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు ప్రీ-వెడ్డింగ్ షూటింగ్స్, వెబ్ సిరీస్, సినిమా షూటింగ్‌ల వంటి భారీ ప్రాజెక్టులకు కూడా అనుమతిని ఇస్తున్నారు.

ఈ పథకం ప్రకారం.. ఎవరైనా మెట్రో కోచ్‌ను స్టేషన్‌లో నిలిపి ఉంచి (Stationary Coach) అందులో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే గంటకు రూ.5,000 చొప్పున, ఒకవేళ నడుస్తున్న రైలులో (Moving Coach) వేడుకలు, షూటింగ్ జరుపుకోవాలనుకుంటే గంటకు రూ.7,000 అద్దెగా నిర్ణయించారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, డాక్యుమెంటరీల చిత్రీకరణ మరియు చిన్న చిన్న సాంస్కృతిక ప్రదర్శనలకు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమాల నిర్వహణలో మెట్రో ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా, భద్రతా నిబంధనలను అతిక్రమించకుండా కఠినమైన నియమాలను MPMRCL జారీ చేసింది.

Next Story