ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు.. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు : మంత్రి దామోదర రాజనర్సింహ

by Batti.Sumithra |

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు.. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు : మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, జూబ్లీహిల్స్: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారని వివరించారు. బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమ ప్రారంభోత్సవంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజనర్సింహతో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. గత 14 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, దీనికి తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన, ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. జూన్ 28, 29, 30 తేదీల్లో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి కోరారు. మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని, పోలియో నిర్మూలన కోసం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి ఇంటికీ పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ విస్తృత చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆరోగ్య శాఖ కమిషనర్ డా. ఎస్. సంగీత సత్యనారాయణ, డా. నాగలక్ష్మి (మెడికల్ ఆఫీసర్), డా. విజయ్ నిర్మల (జాయింట్ డైరెక్టర్ – చైల్డ్ హెల్త్ & ఇమ్యూనైజేషన్), డా. పుట్ల శ్రీనివాస్ (డీఎంహెచ్‌వో), డా. సంధ్య (డిప్యూటీ డీఎంహెచ్‌వో), డా. పెటర్సన్, డా. జ్యోత్స్నా, డా. డేవిడ్, డా. మురారి, డా. శ్రీనాథ్, డా. శ్రీధర్, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story