సోయి దప్పి వడ్ల పంచాయితీ.. జనం నవ్వుకుంటున్నరు : డీకే అరుణ ఫైర్

by Disha Web Desk |
సోయి దప్పి వడ్ల పంచాయితీ.. జనం నవ్వుకుంటున్నరు : డీకే అరుణ ఫైర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక తెలంగాణ రాబందుల సమితి నేతలు సోయి దప్పి వడ్ల రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఫైర్ అయ్యారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమానికి డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల అబద్ధాల హామీలు ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు.. మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు అవకాశాలు లేకపోవడం తో ఆందోళన చెందుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఎన్నికలలో 600 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఈటల రాజేందర్ గెలుపొందడంతో ఇక తమ పతనం ఆరంభమయిందన్న భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని డీకే అరుణ అన్నారు. ఇన్నాళ్లు సెంటిమెంటుతో.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినవ్.. రైతులకు హామీలు ఇచ్చింది నువ్వు.. పండిన పంటను కొంటాను అని చెప్పింది మీరు కాదా.. హామీలు ఇచ్చేది నువ్వైతే.. కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలా...? అని ప్రశ్నించారు. మీ దీక్షలను.. ఆందోళనలను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నుండి తట్టెడు మన్ను అయినా బయటకు తీసారా..? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేశారా అని డీకే అరుణ ఘాటుగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నీ మోసపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. డబ్బులు.. అధికారంతో గెలవలేరని అన్నారు.

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉండటంతో పాటు, 18 కోట్ల మంది సభ్యత్వాలను కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీని మీరు బంగాళాఖాతంలో కలిపేస్తారు అంటున్నారు.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గత ఏడాది యాసంగిలో 60 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఏడాది 30 లక్షల ఎకరాల్లోనే సాగిందన్నారు.. మహా అంటే వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరి అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మీ కుట్రలు కుతంత్రాలు ఇక సాగవు వచ్చేది ఇక బీజేపీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతకుమార్, ఎంఎం శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, బాలరాజు, సుదర్శన్ రెడ్డి, అంజయ్య, రామకృష్ణ, రామాంజనేయులు, ఎగ్గని నర్సింహులు, భరత్ కుమార్ గౌడ్, బాల త్రిపుర సుందరి, కొంగలి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story