- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణీకరించలేం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ ఘాటు సమాధానం
పాక్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణీకరించలేం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణీకరించలేం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఏడాది జరిగిన 'ఆపరేషన్ సిందూర్' గురించి పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. మే 9 వరకు దాడులకు తెగబడతామని బెదిరించిన పాక్ సైన్యం, మే 10న నేరుగా భారత సైన్యానికి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని వేడుకుందనే నిజాన్ని ఆయన గుర్తు చేశారు. భారత ఆపరేషన్ వల్ల పాక్ వైమానిక స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలే సాక్ష్యమని హరీష్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా వాడుకోవడం పాక్‌కు అలవాటుగా మారిందని, కానీ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సాధారణీకరించలేమని ఆయన తేల్చి చెప్పారు.
సింధు జలాల ఒప్పందం పై స్పష్టత.. జమ్మూ కాశ్మీర్‌లో అంతర్భాగమే!
భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌కు లేదని, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయలేని అంతర్భాగమని హరీష్ పునరుద్ఘాటించారు. సింధు జలాల ఒప్పందంపై స్పందిస్తూ.. 65 ఏళ్లుగా భారత్ ఈ ఒప్పందాన్ని సదుద్దేశంతో గౌరవించినా, పాక్ మాత్రం వేల సంఖ్యలో ఉగ్రదాడులు చేస్తూ ఆ స్ఫూర్తిని దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని పాక్ పూర్తిగా అరికట్టే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు (Abeyance) భారత్ ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. చివరగా పాక్ ప్రజాస్వామ్య పరిస్థితిని ఎద్దేవా చేస్తూ.. 27వ సవరణ ద్వారా సైనిక కుట్రలకు పాల్పడి, సైన్యాధిపతులకు జీవితకాల రక్షణ ఇచ్చుకుంటున్న పాకిస్థాన్, తమ దేశంలో చట్టబద్ధత గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలని భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ హితవు పలికారు.






