నీరందక.. పంట దక్కక.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ల రైతుల పరిస్థితి

by Disha Web Desk 12 |
నీరందక.. పంట దక్కక.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ల రైతుల పరిస్థితి
X

దిశ, తిమ్మాపూర్: చివరి ఆయకట్టు వరకు ఉన్న పంట పొలాలకు నీరు అందించి రైతుల కష్టాలను తీర్చుతామంటున్న పాలకులు, అధికారులు మాటల్లో తప్ప చేతల్లో చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో కాలువకు పక్కనే ఉన్న పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయి. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మానకొండూరు మండలంలోని చెంజర్ల, పెద్దూరు పల్లి, నిజాయితీ గూడెం తో పాటు చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని అందించేందుకు తోటపల్లి రిజర్వాయర్ ద్వారా చిగురుమామిడి మండలం పీచుపల్లి మీదుగా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల మీదుగా నీటిని అందించేందుకు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు.

కాగా కాలువకు ఎగువన ఉన్న తిమ్మాపూర్ మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది దిగువ గ్రామాలకు నీరు రాకుండా కెనాల్ వద్ద అడ్డుకట్టలు వేసి నీటిని అడ్డుకుంటున్నారు. దిగువ ఉన్న తమ గ్రామాలకు నీటిని వదలాలని రైతులు మన్నెంపల్లి సర్పంచ్‌ను అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని అధికార దాహంతో తమను బెదిరిస్తున్నాడని ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరి పంట మేస్తున్న పశువులు..

కాలువ నీళ్లు రాకపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోవడం వల్ల పశువులకు మేతగా వరి పంటను ఆ రైతు మేపుతున్నాడు రూ. లక్షలు ఖర్చు పెట్టి చివరి వరకు పంట చేతికొస్తాదనే రైతుల ఆశలు అడియాశలు గా మారడంతో రైతు వరి పంట ఎండిపోవడం తో ఆత్మహత్య శరణ్యం అంటున్నాడు.

లబోదిబోమంటున్న రైతులు..

భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు వట్టి పోతున్నాయి. వేసవి కాలం కావడం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండటంతో వ్యవసాయ బోర్లలో నీరింకిపోవడం సాగులో ఉన్న వరి పంట చేతికందే సమయంలో నిలువునా ఎండిపోతోంది. దీంతో పొట్ట దశలో నీరులేక వరి పంట ఎండి పోతుండటంతో తిండిగింజలు, పశుగ్రాసం కరువయ్యే పరిస్థితి వస్తుందని రైతులు లబోదిబోమంటున్నారు. దాదాపు మూడు గ్రామాల్లో కలిపి 6 వేల ఎకరాల సాగు చేస్తున్నారు.

ఇందులో ప్రతి ఏటా కెనాల్ నీటి పై ఆధారపడిన రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడం కెనాల్ నీరు అందక దానికి తోడు భూగర్భ జలాలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయి మధ్యంతరంగా వరి పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మానకొండూర్ మండల పరిధిలోని పెద్దూరు పల్లి, నిజాయితీ గూడెం, చెంజర్ల గ్రామాల్లో పెద్ద మొత్తంలో బోరు బావుల్లో నీరు లేక ఇంతకింతకు అడుగంటి పంటలు అధిక నష్టమవుతున్నాయి. వారం రోజుల్లో కెనాల్ నీరు అందకపోతే మరింత ఎక్కువగా పంటనష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కెనాల్ కాలువ పై కొంతమంది అధికార పార్టీ సర్పంచుల పెత్తనం

చివరి ఆయకట్టుకు సాగునీరు అందనీయకుండా రైతులను నట్టేట ముంచుతున్నారు. తోటపల్లి రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి చిగురుమామిడి మండలం పీచుపల్లి ఎంఎం 4 ఉప కాలువ ద్వారా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, నల్లగొండ, మల్లాపూర్, మన్నెం పల్లి గ్రామాల మీదుగా మానకొండూరు మండలంలోని పెద్దూరు పల్లి, నిజాయితీ గూడెం, చెంజర్ల గ్రామాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 2008 సంవత్సరంలో కాలువ పనులు మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2019 సంవత్సరంలో తోటపల్లి రిజర్వాయర్ నుంచి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించారు.

ఈ నీటిపై ఆధారపడిన రైతులు పంట సాగు పెంచారు. ఇక్కడికి బాగానే ఉన్న కెనాల్ పరిసర ప్రాంతాల సర్పంచ్ లు నీటిని దిగువకు వెళ్లకుండా అడ్డుగా కట్టలు వేయడంతో రైతులకు సమస్యలు మొదలైనాయి. పలుమార్లు రైతులు కెనాల్ వెంబడి పోయి అడ్డుకట్టలు తొలగించిన మళ్ళీ అడ్డుకట్టలు వేయడంతో ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతుల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని ల ఉంది. రైతుల సమస్య పై ఇరిగేషన్ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో.. రైతులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి.

Next Story