- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్ప పీడనం.. అయినా జాడలేని వర్షాలు
ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్, జూలై నెలల్లో దంచికొట్టాల్సిన వానలు ఈసారి పూర్తిగా ముఖం చాటేశాయి. వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ వర్షాలు కురవకపోవడంతో ఇరు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన పొడి వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా చూపించలేదు. ఒకటి రెండు జిల్లాల్లో మినహా ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. గత రెండు రోజులుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ.. కేవలం అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయని, భారీ వర్ష సూచన లేదని తాజా వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఆందోళనలో అన్నదాతలు
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు దాటిపోతోంది. అయినా ఇంతవరకు ఎక్కడా కూడా పటిష్టమైన వర్షాలు పడలేదు. దీంతో సాగు పనులు ప్రారంభించలేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ఇంకెప్పుడు వానలు పడతాయి? తాము ఎప్పుడు విత్తనాలు వేయాలి?" అంటూ వాన దేవుడి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆశలు రేపుతున్న అల్పపీడనం
ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ, వాతావరణ నిపుణులు మాత్రం ఒక సానుకూల సంకేతాన్ని ఇస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రస్తుత అల్పపీడన ప్రభావం వల్ల నెమ్మదించిన రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ పేర్కొంటోంది.






