కాంగ్రెస్ ను వీడాలని లేదు.. ఆత్మాభిమానం చంపుకుని ఉండాలని లేదు

by Malleboina Mahesh |

నిజామాబాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న సంక్షోభం! పదవులు దక్కక అసంతృప్తిలో ధర్మపురి సంజయ్. రాజీనామా దిశగా అడుగులు? కవిత కొత్త పార్టీలోకి వెళ్తారా?

కాంగ్రెస్ ను వీడాలని లేదు.. ఆత్మాభిమానం చంపుకుని ఉండాలని లేదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దశాబ్దాల కాలం పాటు జిల్లా రాజకీయాలనే కాదు.. రాష్ట్ర రాజకీయాలనే శాసించిన ఓ సీనియర్ నేత బిడ్డ ఆయన.. ఢిల్లీలో అపాయింట్మెంట్ లేకుండా సోనియాను కలిసేంతటి ఉద్దండుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ తన ఇంటి పార్టీ కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి సంజయ్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి మేయర్ ఆయన. శాంకరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపిన విద్యావేత్త. ఎందరో అనాధలకు, బీద కుటుంబాల వారికి సామూహిక కల్యాణాలు జరిపించిన మానవతా మూర్తి జూనియర్ డీఎస్.. ఇప్పుడు ఆయన పేరు జిల్లా రాజకీయాల్లో ఆకస్మికంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది.

ధర్మపురి సంజయ్ తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అడుగుల్లో అగులేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్‌న వ్యక్తి. ఆయనతో పాటే పార్టీలో కొనసాగిన ఆయన తన తండ్రి డీఎస్ కూడా అప్పట్లో అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తండ్రితో పాటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ టికెట్ కేటాయించక పోయినా, పోటీ చేసే అవకాశం కల్పించకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున సంజయ్ ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. నిజామాబాద్ లోని పలు వార్డుల్లో ప్రత్యర్థి పార్టీలు గట్టి పోటీ ఇచ్చిన వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో ధర్మపురి సంజయ్ కీలక పాత్ర పోషించారు.

ఇంత చేసినా సంజయ్‌కు పార్టీలో ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సంజయ్ లోలోన మదన పడుతున్నట్లు తనకు అతి సన్నిహితంగా ఉండే పార్టీ కార్యకర్తలతో ఎన్నో సార్లు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు ఎందరికో కార్పొరేషన్ పదవులు దక్కాయి. అన్ని అర్హతలు, కుటుంబ నేపథ్యం, కార్పొరేషన్ తొలి మేయర్ హోదా వంటి అనేక అంశాలు రాజకీయ పదవులు దక్కేందుకు అర్హతలుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏ కోశానా లెక్కలోకి తీసుకోలేదనే అసంతృప్తితో సంజయ్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పొమ్మన లేక పొగపెడుతున్నారా..?

కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి సంజయ్ తనకు సరైన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవమేననేది సుస్పష్టం. కానీ, పార్టీ పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారనేదే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. సంజయ్ అవసరం పార్టీకి అవసరం అనుకున్నప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకున్న పార్టీ పెద్దలు, అవసరం లేదనుకుని నిర్ణయించుకుంటున్నారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పథకం ప్రకారం పొమ్మన లేక సంజయ్‌ను పార్టీలో పట్టించుకోకుండా, పార్టీ పదవులు ఇవ్వకుండా, ఆయన స్థాయికి, రాజకీయ, కుటుంబ నేపథ్యానికి తగినంత గుర్తింపు నివ్వకుండా చేస్తోందనే విమర్శలున్నాయి.

ఓ రకంగా పార్టీలో ఆయన ఉండటం ఇష్టం లేని ఒక వర్గం కావాలనే పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు సంజయ్ అనుచరులు, ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సంజయ్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే ఎలాంటి పదవులు కట్టబెట్టినా, తమకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుందేమోననే భయంతోనే, రాజకీయంగా ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేని ఓ రాష్ట్ర స్థాయి నేత ఉద్దేశపూర్వకంగానే సంజయ్ కు ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ఆయనకు ఏ పదవులు దక్కనీయకుండా అడ్డుపడుతున్నట్లు, పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

తీవ్ర అసంతృప్తితో ఉన్నా..

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, పార్టీలో ఉండాలా..? వద్దా..? ? అనేది కూడా ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థ పరిస్థితిలో ఉన్నానని ధర్మపురి సంజయ్ రెండు రోజుల క్రితం ఆయనకు సుధీర్ఘకాలంగా అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులతో చెప్పుకుని బాధ పడినట్లు తెలుస్తోంది. ఓ దశలో తనకే మాత్రం ప్రాధాన్యత ఇవ్వని పార్టీని అంటిపెట్టుకుని, ఇంతటి అసంతృప్తితో పార్టీలో కొనసాగడం అవసరమా? అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీఎస్ కుటుంబం నుంచి వచ్చిన తాను, కార్పొరేషన్ కు తొలి మేయర్ గా చెరిపేయలేని గుర్తింపు కలిగిన నన్ను పార్టీలో ఓ ముఖ్య నేత కారణంగానే వెనక్కి నెట్టివేయబడుతున్నానని, ఎంత కాలం పార్టీలో ఉన్నా తనకు ప్రాధాన్యత దక్కదనే విషయం అర్థమైపోయిందంటూ బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన తండ్రి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆ నేత ఇప్పుడు తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేయాలని చూస్తున్నారని వాపోయినట్లు సమాచారం. పార్టీ నుంచి నేరుగా పొమ్మన లేక.. పార్టీలో పొసగనీయక.. అన్న చందంగా తనతో ఆడుకుంటున్నాడని ఆవేదనతో అన్నట్లు తెలుస్తోంది.

తనది డీఎస్ రక్తం..

తను ధర్మపురి శ్రీనివాస్ కొడుకునని, తనలో ప్రవహిస్తున్నది డీఎస్ రక్తమని ధర్మపురి సంజయ్ అనుచరులతో తన ఆవేదనను షేర్ చేసుకునే క్రమంలో అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తాను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితికి రాజీపడి ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీలో ఇమడ లేకపోతున్నానని, పార్టీకి రాజీనామా చేస్తానని తన అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన అనుచరుల్లో మెజారిటీ సభ్యులు సంజయ్ కు మద్ధతుగా ఉండగా కొద్ది మంది మాత్రమే ఇంకా కొంత సమయం వేచి చూడటం మంచిదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న సంజయ్ మాత్రం పార్టీకి తన రాజీనామా విషయంలో ఎలాంటి స్పష్టం మాత్రం ఇవ్వకపోయినా, పార్టీలో ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.

పార్టీ వీడితే సంజయ్ అడుగులు ఎటువైపు..?

ధర్మపురి సంజయ్ ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఆయన రాజకీయంగా మళ్లీ ఎటు వైపు అడుగులు వేస్తారనే అంశంపై ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన సోదరుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రస్తుతం బీజేపీ లో ఓ అగ్రనేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆయనకు రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా గట్టి పట్టుంది. జనాల్లో కూడా విశేష ఆదరణ కలిగి ఉన్న నేతగా గుర్తింపును కలిగి ఉన్నారు. అన్నింటికీ మించి అర్వింద్ తో కుటుంబ కలహాల కారణంగా సంజయ్ కు సఖ్యత లేదు. వారిద్దరూ ఉత్తర, ధక్షిణ ధృవాల్లా ఉంటారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ధర్మపురి సంజయ్ చేరాలనే ఆలోచన కూడా చేసే అవకాశాల్లేవు.. ఇక బీఆర్ఎస్.. ఆ పార్టీలో ఇప్పటికే చాలా మంది నేతలున్నారు. వీరందరిలో సంజయ్ కు తగినంత ప్రాధ్యాన్యం దక్కుతుందనే అవకాశం కూడా లేదు. ఇక కనుచూపు మేరలో మిగిలింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ.

కవిత పార్టీలోకి వెళితే..

ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడి కవిత పార్టీలోకి చేరే అవకాశాలను కూడా ఆయన అనుచరులు, ఆయన గురించి బాగా తెలిసిన వారు తోసిపుచ్చడం లేదు. ఎందుకంటే కవిత పార్టీ నుంచి నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు బలమైన నాయకుడు ఎవరూ కనిపించడం లేదు. పైగా కవితకు రాజకీయంగా బద్ద శత్రువు ఎంపీ అర్వింద్ ధర్మపురి. ఈయన స్వయాన ధర్మపురి సంజయ్ కు తమ్ముడు. సంజయ్ ను ఎక్కుపెట్టి రాజకీయంగా అర్వింద్ ను దెబ్బ కొట్టాలనే కవిత ఆలోచనకు ధర్మపురి సంజయ్ సరైన ఆయుధం కాగలడని కవిత బలంగా విశ్వసించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవిత పార్టీలోకి సంజయ్ చేరితే తన పార్టీ తరపున అర్వింద్ ను అంతం చేసే అస్త్రంగా ఆయనను మలుచుకోవచ్చని కవిత భావించే అవకాశాలున్నాయి. ఆమె ఆలోచనలు సంజయ్ కు రాజకీయంగా పార్టీ పరంగా బలంగా మారి తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ రాజకీయంగా ధర్మపురి సంజయ్ చుట్టూ అల్లుకుంటున్న ఊహాగానాలు మాత్రమే. వాస్తవానికి ధర్మపురి సంజయ్ మనసులో ఏముందో.. తెలియని పరిస్థితి.

బుజ్జగించి.. నామినేటెడ్ పదవినిస్తే..?

కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్న సంజయ్‌ను పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనతో మాట్లాడి బుజ్జగిస్తే .. పార్టీలో ఆయన కోరుకున్న ప్రాధాన్యత దక్కేలా హామీనిస్తే.. నామినేటెడ్ పదవిని కట్టబెడితే.. అనే అంశాలు కూడా సంజయ్ ఎపిసోడ్ లో కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి..

Next Story