ఇష్టారీతిన సెల్లార్ల తవ్వకాలు..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-08 02:58:56  IST  )

మల్కాజ్గిరి మున్సిపల్​ కార్పొరేషన్​(ఎంఎంసీ) ఎల్బీనగర్​ జోన్​.. నాగోల్ సర్కిల్–11 పరిధిలో అక్రమ సెల్లార్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

ఇష్టారీతిన సెల్లార్ల తవ్వకాలు..!
X

దిశ, వనస్థలిపురం: మల్కాజ్గిరి మున్సిపల్​ కార్పొరేషన్​(ఎంఎంసీ) ఎల్బీనగర్​ జోన్​.. నాగోల్ సర్కిల్–11 పరిధిలో అక్రమ సెల్లార్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పర్మిషన్లు లేకుండానే సర్కిల్​ పరిధిలో భారీగా సెల్లార్లు తవ్వుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నివాస కాలనీల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం ప్రమాదకరంగా లోతైన అనుమతులు లేని సెల్లార్లు తవ్వుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్థానికుల ఫిర్యాదులు, కాలనీ సంఘాలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ అధికారులు నెలల తరబడి ‘చూస్తాం.. నోటీసులిస్తాం.. ఎంత మంది ఫిర్యాదులు చేస్తారు’ అంటూ అసహనంగా సమాధానమిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్​ప్లానింగ్​ ఏసీపీ మొదలుకొని టీపీఎస్, చైన్​మన్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెల్లార్లపై జోనల్​కమిషనర్​కు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

మన్సూరాబాద్​ డివిజన్‌లో భారీ సెల్లార్​..

ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం తెచ్చిన ‘బిల్డ్ నౌ’ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో జరుగుతున్న కొత్త తరహా దోపిడీకి నాగోల్ కొత్త​సర్కిల్​–11 అడ్డాగా మారింది. ఈ తతంగానికి ఎంఎంసీ .. ఎల్బీనగర్​ జోన్​.. నాగోల్​ సర్కిల్​ .. మన్సూరాబాద్​ డివిజన్​లోని బిర్లా స్కూల్​ పక్కన నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న భారీ సెల్లార్​ టౌన్​ప్లానింగ్​విభాగం అధికారుల అవినీతికి సజీవ సాక్ష్యం గా నిలుస్తోంది. కమర్షియల్​స్పేస్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్​ పర్మిషన్ తీసుకొని.. పర్మిషన్​ లేని భారీ సెల్లార్​ నిర్మిస్తున్నారని స్థానికులు, కాలనీ సంఘాలు ఆరోపిస్తున్నారు. సర్వే నెం.23లో గల ప్లాట్ నెం.10, 11 ఉత్తర భాగం, ప్లాట్ నెం. 11 దక్షిణ భాగంలో 601.64 చ.మీ విస్తీర్ణంలో స్టిల్ట్ ప్లస్​5 అంతస్తుల రెసిడెన్షియల్​ పర్మిషన్​ తీసుకున్నారు. కానీ అనుమతులకు విరుద్ధంగా భారీ సెల్లార్​ నిర్మిస్తున్నారు.

జోనల్ ​సీపీ వరకు అంతా సైలెంట్..

అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాల్సిన చైన్మన్లు, టీపీఎస్, వాటిపై చర్యలు చేపట్టాల్సిన ఏసీపీ, జోనల్​ సీపీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు చేపట్టడంలో అధికారుల తాత్సర్యం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు సెల్లార్​పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు .. సర్కిల్​ ఏసీపీ నుంచి జోనల్​ సీపీ , జెడ్సీ వరకు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. ఎందుకు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఒకలా తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్​ తవ్వుతున్నా.. నోటీసులు ఇచ్చామని చెప్పడమేమిటని నిర్లక్ష్య లేమి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టౌన్​ప్లానింగ్​ ఉన్నట్టా..? లేనట్టా?

ఈ అక్రమ సెల్లార్​ పై కొన్ని నెలలుగా ఫిర్యాదులు అందుతున్న అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల బదిలీలు ​అయిన సర్కిల్-11 డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధు, టీపీవో సోమేశ్వర్‌కు ఈ సెల్లార్​ విషయంలో భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేయాల్సి ఉండగా, ఇప్పటికీ సెల్లార్​లో భవన నిర్మాణ పనులు యథేచ్ఛగా సాగుతున్న.. అధికారులే బిల్డర్లకు అడ్డుగోడలా మారడం గమనార్హం.

జోనల్​ అధికారుల తీరుపై విమర్శలు..

టౌన్​ప్లానింగ్​ జోనల్‌ సీపీ శ్రీనివాస్‌ యాదవ్‌ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు సెల్లార్‌పై ఆయనకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని వాపోతున్నారు. అక్రమార్కులకు జోనల్​ అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ వికాస్​ మహతో నైనా స్పందించి అనుమతులు లేని సెల్లార్ల తవ్వకాల పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story