యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న MRI ధరలు!

by Muthe.Rajitha |

మిడిల్ ఈస్ట్ యుద్ధం కేవలం చమురు రంగానికే పరిమితం కాకుండా వైద్యరంగాన్ని కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తోంది.

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న MRI ధరలు!
X

దిశ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ యుద్ధం కేవలం చమురు రంగానికే పరిమితం కాకుండా వైద్యరంగాన్ని కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత, ఇరాన్ వరుస దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లో గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా హీలియం (Helium) కొరతకు దారితీసింది. వైద్యపరీక్షల్లోని MRI (Magnetic Resonance Imaging) స్కాన్ మెషీన్లలోని మ్యాగ్నెట్స్ ను చల్లబర్చడానికి హీలియం అత్యంత కీలకం. హీలియం కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఖతర్ కీలకం

అయితే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే హీలియంలో సుమారు మూడింట ఒకవంతు (30% పైగా) వాటా ఒక్క ఖతర్ దేశానిదే. ప్రస్తుతం ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతర్‌లోని గ్యాస్ ప్లాంట్లు మూతపడటం, హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌కు హీలియం సరఫరా పూర్తిగా కట్ అయిపోయింది. హీలియం లభ్యత తగ్గడంతో దాని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల ఆసుపత్రులలో MRI స్కాన్ల ఖర్చు విపరీతంగా పెరగడమే కాకుండా, అత్యవసరమైతే తప్ప కొత్త స్కాన్లను నిర్వహించవద్దని కొన్ని దేశాల్లో ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అవుతున్నాయి. కేన్సర్ గుర్తింపు, మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధుల నిర్ధారణకు MRI కీలకం కావడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?

ప్రస్తుతానికి హీలియంకు సరైన ప్రత్యామ్నాయం లేదు. అయితే, కొన్ని ఆధునిక MRI మెషీన్లు (Helium-free or Low-helium technology) తక్కువ హీలియంతో పనిచేసేలా రూపొందించబడ్డాయి. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెజారిటీ మెషీన్లకు నిరంతరం హీలియం రీఫిల్లింగ్ అవసరం. ఒకవేళ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే, వైద్యరంగం ఊహించని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా హీలియం నిల్వలు ఉన్నప్పటికీ, గల్ఫ్ దేశాల నుండి వచ్చే సరఫరా ఆగిపోవడాన్ని అవి భర్తీ చేయలేకపోతున్నాయి.

Next Story