ప్రధాని మోడీకి ఆ అవార్డ్ ఇవ్వాలి.. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీకి ఆ అవార్డ్ ఇవ్వాలి.. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వం కార్పొరేటైజేషన్ చేస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో ఆరితేరినందున ఆయనకు ప్రపంచంలోనే పెద్ద గ్లోబల్ అవార్డు ప్రధాని మోడీకి ఇవ్వాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి డీసీఎంఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిస్తూ నిరుద్యోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1983లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడీఎఫ్ పరిశ్రమను ఏర్పాటు చేశారని.. జిల్లా ప్రజల నుంచి 32 వేల ఎకరాలు తీసుకుని పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగాలు కల్పించారని దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం వల్ల 8వేల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని.. మెదక్ జిల్లాలో ఉండే బీహెచ్‌ఈఎల్, ఓడి‌ఎఫ్ పరిశ్రమలను ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను పీకేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంటే వారికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నలుగురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్న ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఓడీఎఫ్ పరిశ్రమను ప్రైవేటీకరణ చేశారని.. దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిని మాత్రం యాజమాన్యం తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేయడంతో అందులో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీస్తామన్నారు.


Next Story