- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముని బాటలో కాంగ్రెస్.. రావణుని బాటలో బీజేపీ : ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాముని పాలన నడుస్తుందని, మోడీ ఆధ్వర్యంలో దేశంలో రావణాసురుని పాలన నడుస్తుందని ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి ఆదర్శాల బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, సర్వజన సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా మన్ననలు పొందుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాదరణతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం బీజేపీ నాయకుల మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అత్యంత అవినీతి, అక్రమాలు, నియంతృత్వ ధోరణులతో ఒక రావణాసుర పాలనను సాగిస్తోందని, అలాంటి మత రాజకీయాలు చేసే పార్టీకి తెలంగాణలో ఎంతమాత్రం అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఇటీవల తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించిన బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ పర్యటన ఒక 'అట్టర్ ప్లాప్ షో' గా ముగిసిందని మల్లు రవి ఎద్దేవా చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ముక్త్ రాష్ట్రంగా మారుస్తామంటూ నితిన్ నబీన్ చేసిన ప్రగల్భాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం బీజేపీ వల్ల కాదు కదా.. ఎవరి వల్లా కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని, తెలంగాణ సమాజం మత విద్వేష రాజకీయాలను ఎప్పుడూ ఆదరించదని స్పష్టం చేశారు. రేవంత్ ఆధ్వర్యంలో రాముని బాటలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము బీజేపీకి లేవని, క్షేత్రస్థాయిలో ఉనికి కోసమే ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు.
బీజేపీ ముక్త్ భారత్ ఖాయం
అయోధ్య రామమందిరం అంశంపై బీజేపీపై మల్లు రవి తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత 40 ఏళ్లుగా అయోధ్య రాముడి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న బీజేపీ.. చివరకు ఆ దేవుడి సొమ్మును కూడా వదలకుండా దిగమింగిందని ధ్వజమెత్తారు. పాప భీతి, దైవ భక్తి లేకుండా దేవుడి పైసలనే మింగేసిన బీజేపీకి దేశంలో ఇక పుట్టగతులు ఉండవని, త్వరలోనే దేశం 'బీజేపీ ముక్త్ భారత్' కావడం ఖాయమని జోస్యం చెప్పారు. స్వయంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోనే ఆ పార్టీ అవినీతిపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దేశంలో బీజేపీకి కాలం చెల్లిందని అయోధ్య వాసులే స్వయంగా అంటున్నారని పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేస్తూ, విభజన రాజకీయాలతో ఎంతో కాలం పాలన సాగించలేరని, రాబోయే సార్వత్రిక ఎన్నికలే బీజేపీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయని మల్లు రవి హెచ్చరించారు. అవినీతి, అక్రమాలతో సాగుతున్న రావణ కాష్ఠానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడనున్నారని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయడం ఖాయమని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధాని పీఠాన్ని రాహుల్ గాంధీ అధిరోహించడం ఖాయమని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు.






