- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఎన్ని బాల్యాలని పాలు కుడిచి పెంచిన చేతులివి?
ఎన్ని భూముల్ని పైరుపంటలతో సాదిన చేతులివి?
ఎన్ని ఎడారి వలసలను సాగనంపిన చేతులవి?
ఎన్ని కన్నీళ్ల చెక్కిళ్ళని స్పర్శించిన చేతులివి?
కానీ చూడు! ఆ తల్లికి తన కన్నీళ్లను తానే తుడుచుకునే తీరికే లేని చేతులవి!
~
నీ కోసం ఎన్ని అన్నం కుండలని దివారాత్రులు ఎత్తి దించిన చేతులవి?
చెలకల్లో కొడవళ్ళ, కలుపు మొక్కల,ముళ్ళ, రాళ్ళు గుచ్చిన, వంటింటి వేడి గరిటెల, కసుక్కుమనే కత్తి గాట్ల, పొయ్యి అగ్గిల సురుక్కుమని కాలిన చేతులవి!
నీ కోసం ప్రతిక్షణం అగ్గగ్గలాడుతూ పనిచేసిన చేతులవి!
నువ్వు పడిపోయిన ప్రతిసారీ లేపి నిలబెట్టిన చేతులవి!
ఇంటిల్లి పాదికీ సేవ చేయడానికి రోజూ వంద చేతులుగా మొలకెత్తే మాంత్రిక చేతులవి!
~
తెల్లవారు ఝామున నొప్పిని దాచుకుని, మెటికలు విరుచుకుని, తమను తాము సాగ దీసుకుని పనికి దిగే చేతులవి!
నీ జ్వరాన్ని నిమురుతూ తనలోకి పీల్చుకున్న జ్వరపడ్డ చేతులవి!
ఇల్లు చేసే కర్ర పెత్తనాలకు తిరగబడ్డ చేతులవి!
~~
మోదుగ పువ్వుల సాక్షిగా కొడుకుల,కూతుళ్ళ అమరత్వాన్ని కన్నీళ్ళు తుడుచుకుని ఎర్రజెండాని ఎగరేసిన చేతులు కదా అవి?
~~
ఎన్నడైనా ఆ చేతులని కళ్ళకద్దుకున్నావా మనిషీ?
అమ్మవో, అమ్మమ్మవో భార్యవో,బిడ్డవో ఎవరివైతేనేం ఆ చేతులు! ఎన్నడైనా వడలి వాడిపోయిన ఆ చేతులనలా జతనంగా,ప్రేమగా పట్టుకుని మెత్తటి పరుపుమీద పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పావా ?
నీకు అన్నం వడ్డించే ఆ చేతులని అన్నం తినమని చెప్పావా?
ఆ చేతుల్లో అన్నం ముద్దని పెట్టావా?
~~
నీది కాదు కానీ , ఆమె గుండె చప్పుడులా గల గల లాడే ఆ గాజులదెంత పుణ్యమో! అమ్మ చేతులని ముద్దాడుతూ కుశలమడిగే అదృష్టాన్ని మెరిపిస్తున్నాయి!
బిడ్డలు పలకరించక చిన్నబోయిన అమ్మని గల గలా పలకరిస్తున్నాయి!
చూడు! రేపో మాపో పగిలిపోయే గాజులు కూడా అమ్మలతో ముచ్చట్లాడుతున్నాయి!
~~
- గీతాంజలి
- Tags
- Poem






