- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీవో కార్యాలయంలో ‘మార్ఫింగ్’ దందా.. యజమానికి తెలియకుండా వాహన రిజిస్ట్రేషన్!
గద్వాల ఆర్టీవో కార్యాలయంలో మార్ఫింగ్ కుంభకోణం! యజమాని ప్రమేయం లేకుండానే వాహన రిజిస్ట్రేషన్. షోరూమ్ మేనేజర్, అధికారులపై కేసు నమోదు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : జిల్లా రవాణా కార్యాలయంలో సాగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను ‘దిశ’ పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వాహన యజమానులకు తెలియకుండానే ఫోటోలు, ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనంపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అసలేం జరిగింది?
బాధితుడు కృష్ణ కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం విషయంలో అధికారులు తమ చేతివాటం ప్రదర్శించారు. యజమాని ప్రమేయం లేకుండానే అతడి ఆధార్ కార్డును, ఫొటోను మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ అక్రమం బయటపడడంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు బాధితుడితో బేరసారాలకు దిగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో కార్యాలయంపై పెత్తనం చలాయిస్తున్న ఓ ‘షాడో’ అధికారి పాత్రపై బలమైన ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసుల విచారణ వేగవంతం..
బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ విచారణను ముమ్మరం చేశారు. హీరో షోరూం మేనేజర్ నరసింహ తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని జిల్లా రవాణా అధికారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోటో మార్ఫింగ్ వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు ఎవరు? ఇలా ఇంకా ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ముగ్గురు అధికారులకు మెమోలు..
ప్రాథమిక ఆధారాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులకు జిల్లా రవాణా అధికారి వెంకటేశ్వరరావు మెమోలు జారీ చేశారు. అయితే కేవలం మెమోలతో సరిపెట్టకుండా, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అటు రవాణా శాఖ, ఇటు షోరూమ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.






