ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

by Batti.Sumithra |

పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
X

దిశ, దేవరకొండ టౌన్ : పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజన సౌకర్యాలను ఎమ్మెల్యే నిశితంగా పరిశీలించారు. ఆహార నాణ్యత పై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

రోగులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు, సంబంధిత సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. రోగుల పట్ల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మానవతా దృక్పథంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను నిరంతరం మెరుగుపరచాలని, వైద్య సేవల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story