పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సహజవనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకం నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సహజవనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకం నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు రాష్ట్రప్రభుత్వం రూ.162.57 కోట్లు కేటాయించిందని తెలిపారు. మున్నేరు-పాలేరు లింక్ కాలువ పొడవు 9.6 కిలోమీటర్లు కాగా.. సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాలకు స్థిరీకరణతోపాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్ఎస్‌పీ ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని వెల్లడించారు. మున్నేరు నుంచి ఏటా వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు వృథాగా పోతున్న సుమారు 50 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు నిర్మణానికి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసినట్లు తెలిపారు. దానికి తోడు ఖమ్మం జిల్లాలో మున్నేరు నుండి వస్తున్న నీటితో సంభవిస్తున్న నష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలోని చెక్ డ్యామ్ ద్వారా నీరు మళ్లించి మున్నేరు-పాలేరు లింక్ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2ను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కింద ఉన్న డీబీఎం 60 ద్వారా ఖరీఫ్ సాగుకు 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరుతుందని స్పష్టం చేశారు. అలాగే.. సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పథకం ద్వారా డీబీఎం 71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగునీటిని అందించవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కేవలం సాగునీరు మాత్రమే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకానికి నీటిని కేటాయిస్తున్నట్లు వివరించారు. అన్నింటికీ మించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీతారామ ప్రాజెక్ట్‌ విద్యుత్ చార్జీల భారం నుండి తప్పించుకోవడంతోపాటు అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్‌లో 2 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు.

Next Story