పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర పెంపు లేదు : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర పెంపు లేదు : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా సంపూర్ణ ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలనే సూత్రాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సాధారణ వరి మద్దతు దర క్వింటాల్‌కు రూ. 2,441గా నిర్ణయించడం ద్వారా గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.72 మాత్రమే పెంచారని తెలిపారు. ఇది కేవలం 3 శాతం పెరుగుదల మాత్రమేనని, ఎరువులు, కార్మిక చార్జీలు, విత్తనాలు, డీజిల్, విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఈ పెంపు రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని పేర్కొన్నారు. వరి మద్దతు ధర రూ.72 పెంపుతో రైతులను ఊరడించాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 2,410గా నిర్ణయించి కేవలం రూ. 10 మాత్రమే పెంచారని కందిపప్పు రూ.8,450గా నిర్ణయించి రూ.450 పెంచినప్పటికీ, పప్పుధాన్యాల సాగులో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలకు తగిన పెంపు కాదన్నారు.

పత్తికి క్వింటాల్‌కు రూ.8,267గా నిర్ణయించి రూ. 557 పెంపు జరిగిన పత్తి సాగులో పెరిగిన పెట్టుబడులతో ఏమూలకు పోవని, వేరుశెనగ రూ. 7,517గా నిర్ణయించి కేవలం 3.5 శాతం పెరిగిందని, సోయాబీన్ రూ. 5,708గా నిర్ణయించి 7.1 శాతం పెంచడం కూడా రైతుల ఆశించిన స్థాయిలో లేవన్నారు. కేంద్రం ప్రతి ఏటా మద్దతు ధర పెంచుతున్నామని ప్రచారం చేస్తున్న రైతులకు ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు కల్పించాలంటే మద్దతు ధర కనీసం 30 నుంచి 40 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని, పండించిన పంటలను 75 శాతం కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు.

మద్దతు ధర ప్రకటించి కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకోవడం రైతులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం పరిధిలోకి తీసుకువచ్చి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పంటలను పథకంలో చేర్చకపోవడంతో రైతులు మార్కెట్‌లో దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మద్దతు ధర ప్రకటించడం ఒక్కటే రైతుకు మేలు కాదు. ఆ ధరకు పంటను కొనుగోలు చేసినప్పుడే అర్థం ఉంటుంది. లేకపోతే అది రైతులను మభ్యపెట్టే ప్రకటనగానే మిగిలిపోతుందన్నారు.

Next Story