Minister Roja: చంద్రబాబు ఫ్రస్టేషన్‌పీక్స్‌లో

by Disha Web Desk 12 |
AP Minister Roja Comments On Chandrababu Naidu
X

దిశ, ఏపీ బ్యూరో : Minister Roja Says Chandrababu Naidu is in Peak stage of frustration| టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్స్‌లో ఉందంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోందన్నారు. ఇక ఏ ఎన్నిక జరిగినా వార్ వన్ సైడ్ అని తేలిపోవడంతో చంద్రబాబు ఏం చేయాలో తోచక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా అవనిగడ్డలో నిర్వహించిన మూడవ విడత కాపు నేస్తం కార్యక్రమంలో ఆర్ కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అప్పుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్థిక సమస్యలు ఎదురైనా ప్రజల కోరుకున్న పాలనను జగన్ అందిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు.

ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 2014లో చంద్రబాబు, బీజేపీ, పవన్‌ కల్యాణ్ కలిసి వచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలుసునని మంత్రి రోజా గుర్తు చేశారు. కాపులకు చంద్రబాబు చేసింది అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు తప్ప వారికి ఉపయోగపడే విధంగా ఏనాడూ ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడిని తరిమి తరిమి కొట్టాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. 2019 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా వైసీపీ విజయఢంకా మోగించింది అంటే ప్రజల మద్దతు తమ పార్టీకే ఉన్నట్లు అని చంద్రబాబు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ విషయం తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ చేస్తుండటం హాస్యాస్పదమన్నారు.

సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని... ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు నుంచి వచ్చిన ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మంత్రి రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబు పర్యటనను పట్టించుకోకపోవడంతో సహించుకోలేక రాజీనామాలు అంటూ కొత్త నాటకాలు మెుదలు పెట్టారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన పద్ధతి మార్చుకుని బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కానీ జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వీడటంలేదంటూ టీడీపీ చేసిన ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. జగన్ బయటికి రావడం లేదంటున్నారు. బయటికొస్తే ప్రజల్లో వస్తున్న అభిమానం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అంటూ మంత్రి రోజా విరుచుకుపడ్డారు. అనంతరం రోజా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని తాను కోరుకున్నట్లు రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు.

ఇది కూడా చదవండి:

పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు



Next Story